ICC Under-19 World Cup 2022 Final: ఈనెల 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరుగనున్నది. అంతకుముందే నేటి రాత్రి ఇండియా-ఇంగ్లాండ్ కుర్రాళ్ల మధ్య  వెస్టిండీస్ లో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి..  

అండర్-19 వన్డే ప్రపంచకప్ లో అప్రతీహాతంగ ఆడుతూ ఫైనల్ కు చేరుకున్న భారత్.. జైత్రయాత్రను విజయంతో ముగించాలని చూస్తున్నది. ఈ మేరకు పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. ఇప్పటికే నాలుగు ప్రపంచకప్పులు గెలిచిన భారత్.. ఐదో సారి విజేతగా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. అయితే వెస్టిండీస్ లో జరుగుతున్న ఈ మెగా టోర్నీపై ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన యువ క్రికెటర్లను కూడా వేలంలో దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరుగబోయే ఫైనల్ లో రాణించే భావి భారత క్రికెటర్లపై ఐపీఎల్ జట్లు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. 

ఈసారి ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తప్పకుండా తీసుకుంటారనేవారి జాబితాలో యువ భారత జట్టు నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, విక్కీ ఓస్త్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్ లు ఉన్నారు. ఈనెల 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. 

ముందుగా ధుల్ విషయానికొస్తే.. భారత్ కు జూనియర్ ప్రపంచకప్ అందించిన మాజీ సారథులు విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్ మాదిరిగానే ధుల్ కూడా ఢిల్లీ కుర్రోడే. ఈ టోర్నీలో అతడు మూడు మ్యాచులే ఆడాడు. మూడు ఇన్నింగ్సులలో కలిపి అతడు చేసిన పరుగులు 212.. బ్యాటింగ్ సగటు ఏకంగా 106 గా ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ధుల్ బ్యాటింగ్ స్టైల్ కూడా కోహ్లిని పోలినట్టే ఉంటుంది. బ్యాటర్ గానే గాక కెప్టెన్ గా కూడా రాణిస్తున్న ఈ ఢిల్లీ కుర్రాడిని దక్కించుకోవడానికి ఈసారి ఐపీఎల్ జట్లు ఆసక్తిని చూపిస్తున్నాయి. 

షేక్ రషీద్ : మన తెలుగు కుర్రాడే. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కు చెందిన రషీద్ యంగ్ టీమిండియా జట్టుకు వైస్ కెప్టెన్. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇక ఈ ప్రపంచకప్ లో మూడు మ్యాచులు ఆడాడు. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో 90 పరుగులు చేయగా.. క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ పై 72 రన్స్ చేశాడు. సెమీస్ లో తిరిగి ఆసీస్ మీద 94 పరుగులు సాధించాడు. అంతకుముందు ఆసియా కప్ తో పాటు విను మాన్కడ్ అండర్-19 ట్రోఫీలో కూడా మెరుగ్గా రాణించాడు. 

విక్కీ ఓస్త్వాల్ : ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే విండీస్ పిచ్ లపై బ్యాటర్లకు తన స్పిన్ రుచి చూపిస్తున్నాడు టీమిండియా యువ స్పిన్నేర్ విక్కీ ఓస్త్వాల్. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ (భారత్ తరఫున) విక్కీనే. ఈ టోర్నీలో అతడు 12 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో 5 వికెట్లు పడగొట్టాడు. 

హర్నూర్ సింగ్ : భారత యువ ఓపెనర్ హర్నూర్ సింగ్ దూకుడుగా ఆడటంలో దిట్ట. సెహ్వాగ్ మాదిరే ఆది నుంచే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు హర్నూర్. ఈ సిరీస్ కు ముందు ఆసియాకప్ లో కూడా మెరుగ్గా రాణించాడు. ఇతడిని దక్కించుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. 

రఘువంశీ : ప్రపంచకప్ లీగ్ మ్యాచులలో సందర్భంగా ఐర్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ భారీ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచులో 144 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బ్యాట్ తోనే గాక బౌలింగ్ కూడా చేయగల సమర్థుడు రఘువంశీ.. ఫైనల్ లో అతడు కచ్చితంగా ప్రభావం చూపగలడని టీమిండియా నమ్ముతున్నది. 

ఈ ఐదుగురితో పాటు ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్, రాజ్ బవ, స్పిన్నర్ నిశాంత్ సింధు లు కూడా అదరగొడుతున్నారు. వీళ్లు కూడా ఐపీఎల్ వేలంలో పోటీ పడనున్నారు.