Asianet News TeluguAsianet News Telugu

IND vs PAK: దాయాదితో సమరానికి సర్వం సిద్ధం.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

T20 World Cup 2022: క్రికెట్ ప్రేమికులంతా  ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో  దాయాది జట్ల మధ్య పోరుకు అంతా సిద్ధమైంది. వరుణ గండం లేకుంటే  మళ్లీ ఇరుదేశాల మధ్య హైఓల్టేజీ పోరు ఖాయం.. 

Ahead Of IND vs PAK Mega clash, Look at Head To Head Records  between Arch Rivals in ICC Events
Author
First Published Oct 23, 2022, 11:42 AM IST

కొత్తొక వింత పాతొక రోత అంటారు పెద్దలు. కొత్త ట్రెండ్‌లు వచ్చినకొద్దీ  పాత విషయాలు బోర్ కొడుతుంటాయి. మార్కెట్‌లో కొత్త వస్తువులు వచ్చాక పాత వస్తువులను పక్కనపడేస్తుంటారు కొంతమంది.. క్రికెట్  కూడా ఇందుకు అతీతమైనదేమీ కాదు.  వన్డే ఫార్మాట్ వచ్చాక టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గింది. ఇక టీ20 వచ్చి వన్డేలను అంతరించే స్థితికి తీసుకెళ్లింది. కొత్త నిబంధనలు వచ్చి  ఆటను మరింత రంజుగా మార్చాయి. కానీ క్రికెట్‌లో ఎన్ని మారినా ఎప్పటికీ మారనిదేదైనా ఉందా..? అంటే  అది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్.  ఆ క్రేజ్ ఎందుకు మారదు..? అనేదానికి సమాధానం దొరకదు. అదంతే.. క్రికెట్‌ను ఆరాదించే రెండు దేశాల క్రికెట్ అభిమానులకు వారి జీవితంలో అది కూడా ఒక భాగం. సంతోషం, దుఖం, కోపం, బాధ, చిరాకు మాదిరిగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఒక ఎమోషన్. భారత్-పాక్ లు తొలి మ్యాచ్ ఆడింది 1952లో. అప్పట్నుంచి ‘ఆ పాత వైరం’ ఇప్పటికీ రోత పుట్టలేదు. రోజురోజుకూ అది మరింత క్రేజ్ ను సంపాదించుకుంటున్నది. 

దేశ విభజన తర్వాత నుంచి  పాకిస్తాన్ తో భారత్  మ్యాచ్ లు ఆడుతూనే ఉంది. నాటి నుంచి నేటి దాకా పాక్ తో మ్యాచ్ అంటే  ఎన్నిపనులున్నా టీవీల ముందు అతుక్కుపోయే అభిమానులు కోట్లలో ఉన్నారు. పనులన్నీ మానుకుని  ఇండియా-పాక్ మ్యాచ్ చూడటానికి ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా  ఎదురుచూసిన రోజులున్నాయంటే అతిశయెక్తి కాదు. 

మరీ 90వ దశకం నుంచి  ఇరు దేశాల మధ్య  మ్యాచ్ లకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మెరుపులు.. వాళ్ల వైపునుంచి వసీం అక్రమ్, షోయభ్ అక్తర్ బౌలింగ్ దాడి వంటివి  అభిమానులకు కావాల్సినంత మజాను అందించాయి.  ఇక 2013 తర్వాత ద్వైపాక్షకి సిరీస్ లు ఆడటం మానేసిన ఇండియా-పాకిస్తాన్ లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) టోర్నీలలో మాత్రమే పోటీ పడుతున్నాయి.  ఐసీసీ ఈవెంట్లలో  పాకిస్తాన్ పై భారత్ కు ఘనమైన రికార్డు ఉంది. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్బంగా నేడు  భారత్-పాక్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా కీలక పోరు జరుగనున్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య రికార్డుల మీద ఓ లుక్కేస్తే..  

భారత్-పాక్ మధ్య మొత్తం మ్యాచ్‌లు : 

- ఇరు జట్లు టెస్టులలో  59 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో పాకిస్తాన్ 12 గెలవగా ఇండియా 9 గెలిచింది. ఏకంగా  38 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. 
- రెండు దేశాల మధ్య 132 వన్డేలు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ 73 మ్యాచ్ లను గెలుచుకుంది. ఇండియా 55 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. 
- టీ20లలో ఇరు జట్లు 11  సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 7 మ్యాచ్ లలో గెలవగా  పాకిస్తాన్ మూడింటిలో గెలిచింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. 

 

ఐసీసీ ఈవెంట్లలో ఇండియా-పాక్ : 

- ఐసీసీ ఈవెంట్లలో భారత్ దే పైచేయిగా ఉంది. వన్డే ప్రపంచకప్ లలో ఇప్పటివరకు ఇండియా-పాక్ ఏడుసార్లు తలపడ్డాయి.  ఏడింటిలోనూ భారత్ దే విజయం. 
- టీ20 ప్రపంచకప్ లో ఇరు జట్లు ఆరుసార్లు పోటీపడ్డాయి. ఇందులో భారత్ ఐదు మ్యాచ్ లు గెలవగా.. పాకిస్తాన్ గతేడాది (2021)  మ్యాచ్ గెలిచింది. 
- ఛాంపియన్స్ ట్రోఫీలలో చిరకాల ప్రత్యర్థుల మధ్య  5 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ 2, పాకిస్తాన్ 3 మ్యాచ్ లు గెలచుకున్నాయి. మొత్తంగా ఇరు జట్ల నడుమ ఐసీసీ ఈవెంట్లలో 18 మ్యాచ్ లు జరిగితే అందులో 14 మ్యాచ్ లను భారత్ గెలుచుకుంది. పాకిస్తాన్  నాలుగింటిలో నెగ్గింది. 

గతేడాదికి బదులు తీర్చుకోవాల్సిందే.. 

ఐసీసీ ఈవెంట్లలో  పాక్ పై భారత్ కే మెరుగైన రికార్డులు ఉన్నా  బాబర్ ఆజమ్ అండ్ కో. ను తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు.  గాయం నుంచి కోలుకుని  షాహిన్ అఫ్రిది తిరిగి జట్టుతో చేరడం ఆ జట్టుకు  కొండంత అండ. గతేడాది అతడు భారత టాపార్డర్ ను కకావికలం చేసిన తాలూకు విజువల్స్ ఇంకా ఇండియా అభిమానుల కళ్లల్లో మెదులుతూనే ఉన్నాయి.  ఇప్పుడతనికి కొత్త కుర్రాడు నసీమ్ షా జతచేరాడు. ఇక బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్ - మహ్మద్ రిజ్వాన్ ల క్లాస్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్, హైదర్ అలీల మెరుపులు, పార్ట్ టైం స్పిన్నర్ల నుంచి  భారత్ కు ప్రమాదం పొంచి ఉంది. వీటిని అధిగమిస్తే మెల్‌బోర్న్ లో భారత్ విజయం ఏమంత కష్టం కాదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios