భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు
T20 World Cup 2022: ఈనెల 23న భారత్ తో కీలక మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్ తాకింది. పాకిస్తాన్ వన్ డౌన్ బ్యాటర్ అయిన షాన్ మసూద్ తలకు బంతి బలంగా తాకడంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈనెల 23న మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే మెల్‌బోర్న్ కు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మ్యాచ్ ఉందనగా పాకిస్తాన్ కు ఊహించని షాక్ తాకింది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్, వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే షాన్ మసూద్ తలకు బలమైన గాయమైంది.
ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా షాన్ మసూద్ కు మహ్మద్ నవాజ్ కొట్టిన బంతి బలంగా తాకింది. బంతి మసూద్ తలకు గట్టిగా తగలడంతో అతడు అక్కడే కిందపడిపోయి పది నిమిషాల దాకా నొప్పిని తాళలేక అల్లాడిపోయాడు.
దీంతో అక్కడే ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చెందిన వైద్య సిబ్బంది.. మసూద్ ను వైద్య పరీక్షల నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి ప్రస్తుతం మెదడుకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. రిపోర్టులు వచ్చిన తర్వాత గానీ భారత్ తో మ్యాచ్ ఆడతాడా..? లేదా..? అన్నది తేలనుంది.
పాకిస్తాన్ తరఫున 25 టెస్టులు, 12 టీ20లు ఆడాడు మసూద్. టెస్టులలో 1,378 పరుగులు చేయగా టీ20లలో 220 పరుగులు చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్తాన్ లతో ముగిసిన ముక్కోణపు సిరీస్ లో ఫర్వాలేదనిపించాడు. ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, అఫ్గాన్ తో మ్యాచ్ లలో కూడా రాణించాడు. అయితే షాన్ మసూద్ కు గాయం గురించి ట్విటర్ లో నెటిజన్లు వ్యవహరిస్తున్న తీరుకు పలువురు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆటగాడి గాయాన్ని కూడా పండుగల చేసుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు.