IPL 2023: ఐపీఎల్ లో గతేడాది ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో ఏడాది వాళ్ల జెర్సీని మార్చింది. నేడు ఆ జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి గతేడాది ఎంట్రీ ఇచ్చి ప్లేఆఫ్స్ వరకూ వెళ్లిన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) రాబోయే సీజన్ కు ముందే కొత్త జెర్సీని విడుదల చేసింది. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్, టీమ్ ఓనర్ సంజయ్ గొయెంకా, బీసీసీఐ సెక్రటరీ జై షా, ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ లతో పాటు జయదేవ్ ఉనద్కత్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది టర్కోయిష్ బ్లూ గ్రీన్ లో మెరిసిన లక్నో టీమ్.. రాబోయే సీజన్ లో ముదురు నీలం రంగు జెర్సీలో దర్శనమివ్వనున్నారు.
తన ట్విటర్ ఖాతాలో లక్నో ఈ జెర్సీని విడుదల చేస్తూ.. ‘కొత్త రంగు, కొత్త ఉత్సాహం, కొంగొత్త ఆశలు, సరికొత్త శైలి’ అని రాసుకొచ్చింది. కాగా ఈ జెర్సీ ముదురు నీలిరంగులో ఉండగా షర్ట్ పై ఎరుపు, ఆకుపచ్చ గీతలు ఉన్నాయి.
ఇదిలాఉండగా లక్నో జెర్సీని ఆవిష్కరించిందో లేదో సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ మొదలైంది. ఈ జెర్సీ మరీ చెత్తగా ఉందని.. దీనిని చూసిన తర్వాత పాతదే బాగుందని అనిపిస్తుందని పలువురు నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జెర్సీ.. 2013 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ వేసుకున్న జెర్సీని పోలి ఉంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్.. నాటి సెహ్వాగ్, ఇతర ఢిల్లీ టీమ్ మెంబర్స్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ లక్నోను ట్రోల్ చేస్తున్నారు.
ఈ జెర్సీపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. గంభీర్, దీపక్ హుడాలు ప్రాక్టీస్ సందర్భంగా వేసుకున్న జెర్సీలు దీనికంటే బావున్నాయని వాటినే ఇచ్చేస్తే సరిపోయేది కదా..? అని ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా గతేడాది ఐపీఎల్ లో లక్నో.. 17 మ్యాచ్ లు ఆడి తొమ్మిదింటిలో గెలిచింది. తొలి ప్రయత్నంలోనే ప్లేఆఫ్స్ చేరినా రాజస్తాన్ రాయల్స్ చేతిలో చావుదెబ్బ తిని ఇంటిముఖం పట్టింది. ఇక జాతీయ జట్టులో ఆడేందుకు తటపటాయించే ఆ జట్టు సారథి రాహుల్.. ఐపీఎల్ అంటే మాత్రం ఎక్కడ లేని ఎనర్జీతో ఊగిపోతాడు. కానీ గత కొంతకాలంగా అతడి ఫామ్ ఆందోళనకరంగా ఉంది. ఈ సీజన్ లో రాహుల్ రాణించడం అతడితో పాటు లక్నోకూ ఎంతో అవసరం. ‘ఆరెంజ్ క్యాప్ ల కోసమే ఆడతాడు..’ అనే అపవాదు ఉన్న రాహుల్ దానిని తిరిగి దక్కించుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
