పెద్ద ప్లానింగే ఇది..! అశ్విన్ను ఎదుర్కోవడానికి భారీ స్కెచ్ వేసిన ఆసీస్.. ఆ కుర్రాడికి డబ్బులిచ్చి మరీ..
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో నాలుగు టెస్టులు ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. ఇండియాను ఓడించడానికి భారీ ప్రణాళికతో వచ్చింది. అందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నది.

19 ఏండ్లుగా భారత్ లో భారత్ ను ఓడించడానికి (2004లో చివరిసారి గెలిచింది) తంటాలు పడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈసారి మాత్రం ఏది ఏమైనా సిరీస్ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగానే భారత్ కు రావడాని కంటే ముందే సిడ్నీలో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి మరీ ప్రాక్టీస్ చేసిన కంగారూలు.. భారత్ కు వచ్చాక వారి వ్యూహాలకు మరింత పదును పెట్టారు. భారత్ లో సహజంగా ఉండే స్పిన్ పిచ్ లలో టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి మాస్టర్ ప్లాన్ వేసింది.
ప్రస్తుతం బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్న ఆసీస్ జట్టు.. భారత్ లో స్టార్ స్పిన్నర్ అశ్విన్ తో పాటు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి గాను బరోడాకు చెందిన కుర్రాడు మహేశ్ పితియాను అరువు తెచ్చుకుంది. ఈ కుర్రాడికి డబ్బులిచ్చి మరీ అతడితో నెట్ ప్రాక్టీస్ చేయించుకుంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ లతో పాటు మరికొంతమందికి మహేశ్ స్పిన్ బౌలింగ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఎవరీ మహేశ్..
గుజరాత్ లోని జూనాగఢ్ కు చెందిన ఈ 21 ఏండ్ల కుర్రాడు రంజీలలో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అచ్చం టీమిండియా బౌలర్ అశ్విన్ మాదిరే బౌలింగ్ చేయడం మహేశ్ ప్రత్యేకత. ముఖ్యంగా అశ్విన్ వేసే ఫ్లైటెడ్ డెలివరీలు, ఆఫ్ బ్రేక్, దూస్త్రాలను అతడు కూడా అదే విధంగా సంధిస్తాడు. సోషల్ మీడియాలో అతడిని ‘అశ్విన్ డూప్లికేట్’అని కూడా పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన ఆసీస్ కోచింగ్ సిబ్బంది.. మహేశ్ ను ప్రాక్టీస్ సెషన్స్ కోసం అరువు తెచ్చుకున్నది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉంటున్న హోటల్ లోనే మహేశ్ కూడా ఉంటున్నాడు.
అశ్విన్ అంటే భయమా..?
సహజంగానే స్పిన్ కు అనుకూలించే ఉపఖండపు పిచ్ లపై అశ్విన్ ప్రమాదకరమైన బౌలర్. ఏమాత్రం అవకాశం చిక్కినా అశ్విన్ చేతిలో బలవడం ఖాయమని ఆసీస్ కు తెలుసు. ఆసీస్ గత పర్యటనలో అశ్విన్ ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఈసారి కూడా ఆసీస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అశ్విన్ తో పాటు ఈసారి జడేజా, అక్షర్ పటేల్ లు కూడా ఆసీస్ కు షాక్ ఇవ్వనున్నారు. స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై అక్షర్ ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే ఆసీస్.. మహేశ్ ను హైర్ చేసుకుని నెట్స్ లో అతడితో బౌలింగ్ చేయిస్తున్నది. మరి ఈ కుర్రాడు ఆసీస్ కు ఏ మేరకు మేలు చేస్తాడనేది త్వరలోనే తేలనుంది.