Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli:నెలరోజులు బ్యాట్ పట్టకపోయేసరికి పిచ్చెక్కింది.. కానీ అది నన్ను ఆపింది : కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆదివారం పాకిస్తాన్ తో జరుగబోయే హై ఓల్టేజీ గేమ్ లో అతడు చెలరేగుతాడని ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ahead of asia Cup, BCCI Shares sensational Interview with Virat Kohli, watch Bating Maestro Thoughts
Author
First Published Aug 27, 2022, 2:31 PM IST

వెయ్యి రోజులకు పైగా శతకం కొట్టలేక తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ ముగిశాక కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకుని  ఆసియా కప్ తో రీఎంట్రీ ఇస్తున్నాడు.   వెస్టిండీస్ తో పాటు జింబాబ్వే సిరీస్ లోనూ కోహ్లీ ఆడలేదు. అయితే తాను  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటివరకు నెల రోజుల పాటు బ్యాట్ పట్టకుండా  ఉండటం ఇదే తొలిసారని  కోహ్లీ అన్నాడు. తానూ మానసికంగా కుంగిపోయానని, అది చెప్పుకోవడానికి సిగ్గుపడనని  చెప్పుకొచ్చాడు. 

ఆసియా కప్ - 2022 ప్రారంభానికి ముందు బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ.. ‘ప్రతీరోజూ నిద్రలేవగానే ఈరోజు ఎలా ఉంటుందో చూద్దామనుకునే వ్యక్తిని నేను.  నేను ఏ పని చేసినా పూర్తి వివేకంతో సంతోషంగా చేస్తా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడతా..

గ్రౌండ్ లో నేను ఎప్పుడూ దూకుడుగా ఉంటా. అలా ఎలా సాధ్యం అని అందరూ అడుగుతుంటారు. బయిట ఉన్నవాళ్లే కాదు, నా సహచర ఆటగాళ్లు సైతం అడుగుతారు. వారికి నేను చెప్పే సమాధానం ఒకటే..  నాకు ఆటమీదున్న ప్రేమ. నేను ఆడే ప్రతి బంతితో నా జట్టుకు సహకారం జరగాలని భావిస్తా. అందుకే గ్రౌండ్ లో నా శాయశక్తులా  క‌ృషి చేస్తా. బయిట చూసేవాళ్లకు ఇది అసాధారణమేమో. నాకైతే కాదు. నా జట్టును గెలిపించుకోవడమే నాకు ముఖ్యం...’ అని తెలిపాడు. 

నెల రోజుల విరామం తర్వాత బ్యాట్ పట్టడంపై మాట్లాడుతూ.. ‘గడిచిన పదేండ్లలో నేను నెల రోజుల పాటు బ్యాట్ పట్టకుండా ఉండటం ఇదే తొలిసారి. కొద్దిరోజులుగా నా సామర్థ్యానికి తగినట్టుగా ఆడటం లేదని నేను గ్రహించాను. అయితే నేను ప్రతీసారి ‘నువ్వు చేయగలవు. పోరాడగలవు. ఆ సామర్థ్యం నీలో ఉంది’ అని సర్ది చెప్పుకునేవాడిని.  కానీ నా శరీరం మాత్రం నేను  ఆలోచించినట్టు లేదు. ఆగిపొమ్మని చెప్పింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నా మనసు కూడా సూచించింది. పైకి నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కనిపించొచ్చు. కానీ  ప్రతీ ఒక్కరికి పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు ప్రమాదకరంగా మారొచ్చు...’ అని  కోహ్లీ చెప్పాడు. 

 

ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిశాక వెస్టిండీస్ పర్యటన నుంచి తప్పుకున్న కోహ్లీ  తన కుటుంబసభ్యులతో కలిసి  ఫ్రాన్స్ లో గడిపాడు.  ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు కోహ్లీ వెళతాడని అంతా ఆశించినా అతడు మాత్రం   తన విశ్రాంతిని కొనసాగించాడు.  నేటి నుంచి ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో ఆడుతున్న కోహ్లీ.. ఆదివారం భారత్-పాకిస్తాన్ కీలక పోరులో మునపటి ఫామ్ ను అందుకుంటాడని అతడి అభిమానులతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా భారీగా ఆశలు పెట్టుకుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios