IPL 2022: మార్చి 26 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్-15 కోసం జట్లన్నీ సన్నాహాలు ప్రారంభించాయి. సోమవారం పంజాబ్ జట్టు కూడా తమ కొత్త సారథిని ప్రకటించింది. కానీ ఆర్సీబీ మాత్రం..
ఐపీఎల్ లో ఇంతవరకు కప్ కొట్టని జట్లలో ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా ఈ సీజన్ కోసం తమ సారథిని ప్రకటిచింది. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను కెప్టెన్ గా చేస్తున్నట్టు పంజాబ్ ప్రకటించింది. పంజాబ్ ప్రకటనతో ఐపీఎల్ లో దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు వచ్చినట్టే.. ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తప్ప.. ఐపీఎల్-15 సీజన్ దగ్గరపడుతున్నా మరి ఆ జట్టు కెప్టెన్ ను ఎందుకు నియమించడం లేదు..? మార్చి 26 నుంచే కొత్త సీజన్ మొదలుకానుండటంతో మిగతా ఫ్రాంచైజీలన్నీ అందుకు సన్నాహాల్లో ఉంటే ఆర్సీబీ మాత్రం ఇంకా కెప్టెన్ కూడా ప్రకటించకపోవడానికి కారణమేంటి..?
సుమారు పదేండ్ల పాటు (2013 నుంచి 2021) దాకా ఆర్సీబీని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి నడిపించాడు. ఇంతవరకూ ఆ జట్టు కూడా కప్ కొట్టలేదు. విరాట్ మీద గంపెడాశలు పెట్టుకున్నా.. అతడు కన్నడీగుల ఆశలు నెరవేర్చలేదు. ఒక బ్యాటర్ గా రికార్డుల మీద రికార్డులు కొట్టిన కోహ్లి.. బెంగళూరుకు కప్ మాత్రం నెగ్గలేదు. ఈ నిరాశో లేక మరే కారణమో గానీ గత సీజన్ కు ముందు తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు కోహ్లి ప్రకటించిన విషయం తెలిసిందే.
విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అయితే జట్టులో కెప్టెన్ ఆప్షన్లు లేవా..? అంటే ఆ సమస్య కూడా లేదు. వేలానికంటే ముందే జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో తీసుకున్న గ్లెన్ మ్యాక్స్వెల్ తో పాటు ఆక్షన్ లో దక్కించుకున్న ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లే.. వీరితో పాటు దినేశ్ కార్తీక్ ను కూడా వేలంలో దక్కించుకున్న ఆర్సీబీకి అతడి రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది.
ఐపీఎల్ జట్లు.. కెప్టెన్లు : ముంబై ఇండియన్స్ (రోహిత్ శర్మ), చెన్నై సూపర్ కింగ్స్ (ఎంఎస్ ధోని), సన్ రైజర్స్ హైదరాబాద్ (కేన్ విలియమ్సన్), కోల్కతా నైట్ రైడర్స్ (శ్రేయస్ అయ్యర్), ఢిల్లీ క్యాపిటల్స్ (రిషభ్ పంత్), పంజాబ్ కింగ్స్ (మయాంక్ అగర్వాల్), లక్నో సూపర్ జెయింట్స్ (కెఎల్ రాహుల్), గుజరాత్ టైటాన్స్ (హార్థిక్ పాండ్యా), రాజస్థాన్ రాయల్స్ (సంజూ శాంసన్), రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరు (?)
మరి ఎందుకు ప్రకటించడం లేదు..?
ఆర్సీబీ సారథిగా గ్లెన్ మ్యాక్స్వెల్ వైపే ఆ జట్టు కోచ్,సహాయక సిబ్బంది, యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తున్నది. కోహ్లి మద్దతు కూడా మ్యాక్సీకే ఉంది. కానీ వచ్చిన సమస్య అంతా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తోనే.. ప్రస్తుతం పాకిస్థాన్ టూర్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లెవరూ ఏప్రిల్ 5 వరకు ఆ దేశాన్ని వీడటానికి వీళ్లేదు. వాళ్లకు ఏప్రిల్ 6 దాకా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చేది లేదని క్రికెట్ ఆస్ట్రేలియా భీష్మించుకుంది. అయితే మ్యాక్సీ ఈసారి పాకిస్థాన్ తో ఆడే ఆసీస్ వన్డే జట్టులో కూడా లేడు. అయినా అతడు ఏప్రిల్ 6 దాకా ఇండియాకు రావడానికి అవకాశం లేదు. ఆ తర్వాత వారం రోజుల దాకా క్వారంటైన్ లోనే ఉండాలి. ఇదే జరిగితే.. మూడు, నాలుగు మ్యాచులకు మ్యాక్సీ అందుబాటులో ఉండడు. మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్ లో.. మ్యాక్సీ జట్టుతో చేరేసరికి కనీసం నాలుగు మ్యాచులైనా ఆడుతుంది. ఇదే ఇప్పుడు బెంగళూరుకు ఆందోళనకు గురి చేస్తున్నది.
డుప్లెసిస్ ను చేద్దామన్నా..
మ్యాక్సీ లా కాకుండా డుప్లెసిస్ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడు. గతంలో దక్షిణాఫ్రికాకు అన్ని ఫార్మాట్లలో సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా అతడికి ఉంది. డుప్లెసిస్ సామర్థ్యంపై అపనమ్మకాలు ఏమీ లేకున్నా.. అతడు జట్టుతో ఎంత కలుపుగోలుగా ఉంటాడనేది సందేహం వ్యక్తం చేస్తున్నాయి ఆర్సీబీ వర్గాలు.
ఈ ఇద్దరూ గాక దినేశ్ కార్తీక్ రూపంలో ఆర్సీబీకి మరో ఆప్షన్ కూడా ఉంది. అతడు గతంలో కోల్కతా నైట్ రైడర్స్ కు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. స్టార్లతో నిండి ఉన్న ఆర్సీబీని అతడు ఎలా నడిపిస్తాడనేదానిపై ఆ జట్టు యాజమాన్యం తర్జనభర్జన పడుతున్నది.
త్వరలోనే ప్రకటన..
అయితే త్వరలోనే తమ జట్టు కెప్టెన్ ప్రకటన ఉంటుందని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయమై ఆ జట్టుకు చెందిన ఓ ప్రతినిధి స్పందిస్తూ.. ‘కెప్టెన్ కోసం మాకు చాలా ఆప్షన్లున్నాయి. త్వరలోనే మీరు ఆ పేరు వింటారు. జట్టు కోచ్ సంజయ్ బంగర్, డైరెక్టర్ మైక్, ఓనర్లు అదే పనిమీద ఉన్నారు. ఆర్సీబీ కొత్త సారథి పేరును త్వరలోనే ప్రకటిస్తాం.. కొత్త సారథికి సంబంధించిన చర్చలు కొలిక్కి వచ్చాయి. మ్యాక్సీ గతేడాది నుంచి మాతో ఉన్నాడు. డుప్లెసిస్ రూపంలో మాకు ఓ నాయకుడున్నాడు. కోహ్లి, ఇతర స్టార్ల గురించి దినేశ్ కార్తీక్ కు భాగా తెలుసు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనేది మేం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..’ అని తెలిపాడు.
