సందు దొరికితే వదలడు కదా.. లిజ్ ట్రస్ రాజీనామాను అడ్డం పెట్టి ఇంగ్లాండ్‌ను దారుణంగా ట్రోల్ చేసిన జాఫర్

Liz Truss: ఇంగ్లాండ్  రాజకీయ సంక్షోభం ఎదుర్కుంటున్నది. బోరిస్ జాన్సన్ స్థానంలో ఇంగ్లాండ్ కు  ప్రధానిగా  ఎన్నికైన  లిజ్ ట్రస్ గురువారం తన పదవికి  రాజీనామా చేశారు. అయితే టీమిండియా మాజీ  క్రికెటర్ వసీం జాఫర్.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ ను  దారుణంగా ట్రోల్ చేశాడు. 

After Liz Truss Resigns, Wasim Jaffer Hilariously Trolls England With his latest tweet

క్రికెట్ ప్రపంచమంతా  టీ20 ప్రపంచకప్ ఫీవర్ తో ఊగిపోతుంది.  గ్రూప్ మ్యాచ్ లు నేటికి ముగుస్తాయి. రేపటి నుంచి అసలు సమరమైన  సూపర్-12 మొదలవుతుంది. ఆస్ట్రేలియా తో పాటు క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ప్రస్తుతం ఈ ఈవెంట్ మీదే ఉన్నాయి.  క్రికెట్ ప్రపంచం ఇలా ఉంటే   ప్రపంచ రాజకీయాలలో మాత్రం పెను మార్పులు చోటు చేసుకున్నాయి.  యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్.. గురువారం తన పదవికి రాజీనామా చేయడం  యూరోపియన్ దేశాలతో పాటు   ప్రపంచ రాజకీయాలలో పెద్ద చర్చకు తావిచ్చింది.  

లిజ్ ట్రస్  రాజీనామా గురించి పట్టించుకునేంత ఓపిక, తీరిక క్రికెట్ అభిమానులకు లేదు. కానీ తరుచూ భారత క్రికెట్ మీద పడి ఏడిచే ఇంగ్లాండ్ కు కౌంటర్ ఇవ్వడంలో ముందుండే వసీం జాఫర్ మాత్రం.. ఆ జట్టును ట్రోల్ చేయడానికి ఈ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. 

తాజాగా ట్విటర్ వేదికగా అతడు స్పందిస్తూ.. ‘టీ20  ప్రపంచకప్ లో పాల్గొనే జట్ల గురించి విశ్లేషణ చేస్తే.. ఇండియాకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్ లేడు. పాకిస్తాన్ కు మంచి ఫినిషర్ లేడు. న్యూజిలాండ్ కు ఆస్ట్రేలియా లో గొప్ప రికార్డు లేదు.  శ్రీలంకకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరు. కానీ ఇంగ్లాండ్ కు  ప్రధానమంత్రి కూడా లేడు..’ అని పేర్కొన్నాడు.  

 

జాఫర్ చేసిన ఈ ట్వీట్  ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును ఉద్దేశించే అన్నది  బర్మీ ఆర్మీ (ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అభిమాన సంఘం) తో పాటు  ఆ దేశాభిమానులు చెబుతున్న మాట.  ప్రధాని విషయాన్ని ప్రస్తావించినా.. జాఫర్ టార్గెట్ మాత్రం బట్లర్ అండ్ కో.  అని  కామెంట్లు వినిపిస్తున్నాయి. జాఫర్ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే వేలాది లైకులు, రీట్వీట్ లు, షేర్ లతో ట్విటర్ హోరెత్తుతున్నది.  

ఇక టీ20  ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్ ను అఫ్గానిస్తాన్ తో ఆడనుంది. స్వదేశంలో  ఇండియా, సౌతాఫ్రికా చేతిలో టీ20 సిరీస్ లు కోల్పోయిన బట్లర్ గ్యాంగ్.. ఇటీవల పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా మీద  గెలిచి ఫుల్ జోష్ లో ఉంది.  

ఇక లిజ్ ట్రస్ విషయానికొస్తే.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ దిగిపోయిన తర్వాత లిజ్ ట్రస్ భారత  సంతతి ఎంపీ రిషీ సునాక్ తో పోటీ పడి  ప్రధాని రేసులో నిలిచింది.  పదవిలోకి వచ్చాక ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఆర్థికంగా  పెను సవాళ్లు,  ధనవంతులకు పన్ను మినహాయింపులు, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటివి ఆమె రాజీనామాకు తీవ్ర ఒత్తిడిని పెంచాయి. సొంత పార్టీకి చెందిన ఎంపీలే ఆమె మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడటంతో ట్రస్ రాజీనామాకు మొగ్గుచూపారు. 45 రోజుల్లోనే ఆమె పదవీకాలం ముగిసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios