Wasim Jaffer vs Michael Vaughan:టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లాండ్ పై  ఇండియా టీ20 సిరీస్ నెగ్గడంతో.. 

ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధమైనా ఆగుతుందేమో గానీ టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ల మధ్య ట్వీట్ల యుద్ధం మాత్రం నిరంతరం కొనసాగేలా ఉంది. ఆధిపత్యం చేతులు మారినప్పుడల్లా ఈ ఇద్దరూ తమదైన శైలిలో ట్వీట్ల పంచులు విసురుకుంటూ ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు కావాల్సినంత ఫన్ ను పంచుతున్నారు. ఇంగ్లాండ్ గెలిస్తే వాన్.. ఇండియా గెలిస్తే జాఫర్.. ఇది ‘వొడువని ముచ్చట’ గా మారిపోయింది. 

ఇటీవలే ఎడ్జబాస్టన్ టెస్టులో భారత్ ను ఇంగ్లాండ్ ఓడించడంతో మైకేల్ వాన్ జాఫర్ ను లక్ష్యంగా చేసుకుని.. ‘ఏం జాఫర్ ఏమైనా నర్వస్ గా ఫీలయ్యావా..?’ అని ట్వీట్ చేశాడు. గతేడాది టీమిండియా ఈ సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉండగా ఎడ్జబాస్టన్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. 

అయితే వాన్ చేసిన ఈ ట్వీట్ కు జాఫర్ అప్పుడే ఓ ఎమోజీ తో ‘అబ్బే.. లేదే..’ అని రిప్లై ఇచ్చాడు. అప్పుడు వాన్ ది పై చేయి. కానీ ఇప్పుడు జాఫర్ వంతు. ఎందుకంటే టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ ను టీ20లలో చిత్తుగా ఓడించి మూడు మ్యాచుల పొట్టి సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తో గెలుచుకుంది. ఇక మనోడు ఆగుతాడా..? 

Scroll to load tweet…

ట్విటర్ వేదికగా జాఫర్ స్పందిస్తూ.. ‘వాన్.. అంతా ఓకేనా..? నువ్వు నిమ్మలంగానే ఉన్నావా..?’ అని ప్రశ్నించాడు. ఓ చిన్నపిల్లాడు విజిల్ వేస్తున్న వీడియో ను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ పెట్టాడు జాఫర్. ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. టీమిండియా ఫ్యాన్స్ జాఫర్ ట్వీట్ కు స్పందిస్తూ.. ‘సూపర్ జాఫర్ బాయ్.. వాన్ కు దిమ్మతిరిగిపోయుంటది..’, ‘దెబ్బ అదుర్స్ కదూ..’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. మరి జాఫర్ పెట్టిన ఈ ట్వీట్ కు వాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Scroll to load tweet…

ఇక టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను 50 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్.. 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది.