మీ ప్రయోగాలు ఆపండి.. ఆ ఇద్దరినీ టీమ్‌లోకి తీసుకోండి : బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం
INDvsNZ T20I: గత దశాబ్దకాలంగా భారత జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన భారత వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

న్యూజిలాండ్ తో రాంచీ వేదికగా ముగిసిన తొలి టీ20లో భారత జట్టు దారుణ వైఫల్యం అభిమానులను నిరాశపరిచింది. ప్రత్యర్థికి కోలుకోవడానికి ఛాన్సులు ఇచ్చి ఆపై వాళ్ల బౌలింగ్ కు దాసోహమైన యువ భారత్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుభవలేమి వల్లే టీమిండియా ఓడిందని వాపోతున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టిన బీసీసీఐ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం యువకులతో ప్రయోగాలు చేయిస్తున్నది. గత దశాబ్దకాలంగా భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా మారిన టీమిండియా సారథి రోహిత్ శర్మతో పాటు మాజీ సారథి విరాట్ కోహ్లీలను పక్కనబెట్టి మరీ యువకులతో సిరీస్ లు ఆడిస్తున్నది.
ఇక నిన్న రాంచీ లో ముగిసిన తొలి టీ20లో భారత అన్ని రంగాల్లో విఫలమైంది. బౌలింగ్ లో పేసర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, హార్ధిక్ పాండ్యాలు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటర్లలో కూడా ఇషాన్ కిషన్, గిల్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడాలు అలా వచ్చి ఇలా వెళ్లారు. అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది.
రాంచీ టీ20లో భారత ఓటమిపై ట్విటర్ వేదికగా పలువురు అభిమానులు బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తొలగించి టీమిండియా మూల్యం చెల్లించుకుంటుందని.. ఇకనైనా బీసీసీఐ దిక్కుమాలిన ప్రయోగాలు కట్టబెట్టి ఈ ఇద్దరినీ టీ20లు ఆడించాలని సూచిస్తున్నారు.
ట్విటర్ వేదికగా పలువురు స్పందిస్తూ.. ‘టీ20లలో మన ఓపెనర్లను చూసినాక రోహిత్, కోహ్లీలు టీమ్ లోకి రావడమే మంచిదని నాకనిపిస్తోంది. ఈ ఇద్దరూ 2024 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలి..’, ‘రోహిత్-కోహ్లీ లేని టీమిండియాను ఊహించుకోలేకపోతున్నాం..’, ‘రోహిత్ -కోహ్లీ లేకపోతే టీమిండియా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి అర్థమై ఉండాలి.. మీ ఇగోలను పక్కనబెట్టి ఆ ఇద్దరినీ ఆడించండి..’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. తర్వాత భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకు మాత్రమే పరిమితమైంది.