ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకి ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా.. ఐపీఎల్ కారణంగా భారతీయులకు ఆయన సుపరిచితుడే. మరీ ముఖ్యంగా ఇటీవల వార్నర్ తన భార్య, పిల్లలతో కలిసి టిక్ టాక్ లు చేస్తూ మరింత ఫేమస్ అయ్యారు. ఈ టిక్ టాక్ వీడియోల ద్వారా చాలా మందికి వార్నర్ చేరువయ్యారు. ఆయన వీడియోలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

తెలుగు పాటలకు కూడా వార్నర్ స్టెప్పులు వేశాడు. బుట్టబొమ్మ, టాప్ లేచిపోద్ది, పక్కా లోకల్ అంటూ.. దాదాపు అన్ని తెలుగు ఫేమస్ పాటలకు స్టెప్పులు వేశాడు. ఆయన డ్యాన్స్ కి  మన హీరోలు కూడా స్పందించారు. అయితే.. ఇప్పుడు భారత్ లో టిక్ టాక్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వార్నర్ ని రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు.

 

‘అప్పో అన్వర్‌?’ అంటూ డేవిడ్ వార్నర్‌కు ట్వీట్ చేస్తూ నవ్వుతోన్న ఎమోజీని ట్వీట్ చేశాడు. కాగా.. అశ్విన్ చేసిన ట్వీట్ లోని డైలాగ్ రజినీకాంత్ భాషా చిత్రంలోనిది కావడం గమనార్హం. ఆ ట్వీట్ తోపాటు  భారత్‌లో చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన విషయానికి సంబంధించిన వార్తను పోస్ట్ చేశాడు. వార్నర్‌ను ట్రోల్‌ చేస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది.

గతంలో వార్నర్‌ చేసిన డ్యాన్సుల వీడియోలను పోస్ట్ చేస్తూ అవి ఎప్పటికీ గుర్తుండి పోతాయని, బాధపడొద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, భారతీయ పాటలకు వీడియోలు చేస్తూ టిక్‌టాక్‌లో వార్నర్‌ ఏకంగా 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు.