Asia Cup 2022: గత కొంతకాలంగా నిలకడలేమితో సతమతమవుతూ ఆసియా కప్ లో అద్వాన్న ప్రదర్శనలు చేసి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ కు మరో షాక్ తగిలింది.
వరుస షాకులతో జట్టులో ఆత్మస్థైర్యం కోల్పోతున్న బంగ్లాదేశ్ కు మరో షాక్ తగిలింది. ఆసియా కప్-2022లో అఫ్గానిస్తాన్ తో పాటు శ్రీలంక చేతిలో ఓడి గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టిన బంగ్లాదేశ్ కు ఊహించని షాక్. ఆ జట్టు ప్రధాన ఆటగాడు, మాజీ సారథి ముష్ఫీకర్ రహీం టీ20లకు గుడ్ బై చెప్పాడు. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ విఫలమవగా ముష్ఫీకర్ కూడా రెండు మ్యాచులలో కలిపి 5 పరుగులే చేసి ఔటయ్యాడు. వయసు మీద పడుతుండటం, ఫామ్ లేమి కారణంగా ముష్ఫీకర్.. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇదే విషయాన్ని ముష్ఫీకర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపాడు. రహీం స్పందిస్తూ.. ‘నేను టీ20 అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలుకుతున్నాను. టెస్టులు, వన్డేల మీద దృష్టి సారిస్తా. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా ఫ్రాంచైజీ క్రికెట్ కు మాత్రం అందుబాటులో ఉంటా.. వన్డేలు, టెస్టులలో నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అని ట్వీట్ చేశాడు.
35 ఏండ్ల ముష్ఫీకర్.. బంగ్లా తరఫున 82 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. టెస్టులలో 9 సెంచరీల సాయంతో 5,235 పరుగులు చేసిన అతడు.. వన్డేలలో 6,774 పరుగులు సాధించాడు. టీ20లలో ఆరు హాఫ్ సెంచరీల సాయంతో 1,500 కు పైగా పరుగులు సాధించాడు.
సీనియర్లుగా ఒక్కొక్కరుగా ఆటకు గుడ్ బై చెప్పడంతో గత కొన్నాళ్లుగా బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నది. పసికూన జింబాబ్వేతో చేతిలో కూడా ఓడింది. ఇటీవలే జింబాబ్వేతో ముగిసిన 3 వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ కోల్పోయింది. దీనికి తోడు జట్టులోని పలువురు ఆటగాళ్లు, బోర్డుకు మధ్య సఖ్యత లేదు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి బోర్డుకు ఊహించిన షాకిచ్చాడు. తాజాగా ముష్ఫీకర్ కూడా అతడి బాటలోనే పయనించాడు.
ఇక యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. తాము ఆడిన తొలి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్.. ఆ తర్వాత శ్రీలంక తో ముగిసిన ఉత్కంఠ పోరులో కూడా ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
