IPL 2023: ఐపీఎల్- 16 లో చెన్నై సూపర్ కింగ్స్  కు సపోర్ట్  చేస్తూ   రాబిన్ ఊతప్ప చేసిన ట్వీట్   విమర్శలకు దారి తీసింది. దీనిపై తాజాగా ఊతప్ప స్పందించాడు. 

ఐపీఎల్ లో సుమారు ఆరు సీజన్ల పాటు కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడిన రాబిన్ ఊతప్ప.. నిన్నట్నుంచి ఆ జట్టు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఐపీఎల్ - 16 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరిన నేపథ్యంలో ఆ జట్టును సపోర్ట్ చేస్తూ చేసిన ట్వీట్ పై కేకేఆర్, షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీఎస్కే - జీటీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రాబిన్ ఊతప్ప తన ట్విటర్ వేదికగా సీఎస్కే జెర్సీని ధరించి ‘లెట్స్ గో @చెన్నైఐపీఎల్..!’ అని ట్వీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. 

ఊతప్ప ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కేకేఆర్ ఫ్యాన్స్ అతడి మీదకు దాడికి దిగారు. 2014 నుంచి 2019 దాకా కేకేఆర్ తో ఉన్న ఊతప్ప.. ఆరు సీజన్ల పాటు అతడిని టీమ్‌లో పెట్టుకున్నందుకు, అతనికి ఇచ్చిన గౌరవాన్ని మరిచిపోయి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.

Scroll to load tweet…

దీనిపై ఊతప్ప నిన్నే ‘నాపై ఇంత హేట్ వస్తుందని ముందుగానే ఊహించా. నాకు ఇదేమీ కొత్త కాదు. మీ అందరికీ శాంతి కలగాలి. లవ్ యూ ఆల్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. తాజాగా నేడు మరోసారి ఊతప్ప స్పందిస్తూ.. ‘గౌతం గంభీర్ కేకేఆర్ ను వీడిన తర్వాత నన్ను టీమ్ లో పరాయివాడిగా చూశారు ఏదేమైనా కేకేఆర్, ఆ జట్టు ఫ్యాన్స్ పై నాకు ఉన్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. నేను ఎప్పటికీ వాళ్లకు కృతజ్ఞుడిగానే ఉంటా. ఇది కేకేఆర్ ఫ్యాన్స్ కోసం కాదు..’అని మరో ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

2014లో కేకేఆర్ కు మారిన ఊతప్ప.. ఆ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు. అదే ఏడాది గౌతం గంభీర్ సారథ్యంలోని కేకేఆర్.. ఐపీఎల్ లో రెండోసారి కప్ కూడా కొట్టింది. 6 సీజన్ల పాటు కేకేఆర్‌కు ఆడిన ఊతప్ప, 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి, అటు నుంచి చెన్నైకి మారాడు. 2021లో చెన్నై నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో ఊతప్పది కూడా కీలక పాత్రే..