ధోని భయ్యా.. ఓరియో అంటివి హిస్టరీ రిపీట్ అంటివి.. ఇదేందిది..?
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సెమీస్ గండాన్ని విజయవంతంగా దాటలేకపోయిన టీమిండియా పై విమర్శల వర్షం కురుస్తున్నది. అయితే విమర్శలతో పాటు నెటిజన్లు ధోనిని కూడా గట్టిగానే అరుసుకుంటున్నారు.
కోట్లాది ఆశలతో ఆస్ట్రేలియాకు చేరిన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశలు అడియాసలే అయ్యాయి. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా.. గత 15 ఏండ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించింది. సెమీస్ గండాన్ని విజయవంతంగా దాటకుండానే ఇంటికి చేరింది. దీంతో రోహిత్ సేనపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా సంగతి అటుంచితే సోషల్ మీడియాలో నెటిజన్లు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని ఆటాడుకుంటున్నారు. ఇండియా ఓడిపోతే ధోనిని తిట్టడమెందుకు..? అనేగా మీ డౌటానుమానం. పైగా జట్టులో ధోని కూడా లేడు. గతేడాది మాదిరిగా మెంటార్ కూడా కాదు. కానీ అంతా ఓరియో మహిమ.
2022 టీ20 ప్రపంచకప్ కు కొద్దిరోజుల ముందు ధోని ఓ పాత్రికేయుల సమావేశం నిర్వహించాడు. ఆ సమావేశంలో ధోని మాట్లాడుతూ.. ‘‘భారత్ లో ఓరియో 2011లో లాంచ్ అయింది. అదే ఏడాది టీమిండియా ప్రపంచకప్ నెగ్గింది. మీకు లింక్ అర్థం అవుతుంది కదా. చరిత్రను సృష్టించాలంటే చరిత్రను తిరగరాయాలి..
ఈ ఏడాది కూడా మరో ప్రపంచకప్ (ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్) ఉంది. కావున, ఓరియో తిరిగి లాంచ్ అయితే టీమిండియా కూడా ప్రపంచకప్ నెగ్గుతుంది..’ అని చెప్పాడు. ఇదే ఇప్పుడు ధోని కొంప ముంచుతోంది. ట్విటర్ వేదికగా అప్పుడే ధోనిని నెటిజన్లు ఈ కామెంట్లపై ఓ ఆటాడుకున్నారు. అయితే ఈ మెగా టోర్నీలో సెమీస్ కు ముందు వరకూ జరిగిన పలు పరిణామాలు భారత్ కు అనుకూలంగానే జరిగినా చివరికి మాత్రం ఇండియా సెమీస్ లో ఓటమి పాలవక తప్పలేదు.
దీంతో నెటిజన్ల కాన్సంట్రేషన్ అంతా మహీ మీదకు మళ్లింది. పలువురు నెటిజన్లు ఫ్రస్ట్రేషన్ లో ‘ఓరియో అంటివి.. చరిత్ర తిరగరాస్తాం అంటివి కదా ధోని భయ్యా.. ఇదేంటి ఇలా జరిగింది. నీ ఓరియో మ్యాజిక్ పని చేయలేదు..’, ‘ధోని ఓరియో లాజిక్ చెప్పాడు గానీ అతడు ప్రస్తుతం టీమ్ లో లేడన్న విషయం మరిచిపోయినట్టున్నాడు..’, ‘2011, 2022.. ఇందులో నీతి ఏంటంటే.. ప్రతీ ఓరియో బిస్కెట్ ఒకే విధంగా ఉండదు..’, ‘ఓరియో వద్దు, పార్లే జీ ముద్దు’ అని కామెంట్లు పెడుతున్నారు. ఓరియో, ధోనిపై మీమ్స్, ట్రోల్స్ తో తమ ఫ్రస్ట్రేషన్ ను చూపెడుతున్నారు. మొత్తానికి టీమిండియా ఓటమి ధోనికి కొత్త చిక్కులు తీసుకొచ్చింది.