Asianet News TeluguAsianet News Telugu

అశ్విన్‌ను కాపీ కొట్టబోయి స్టబ్స్‌కు లైఫ్ ఇచ్చి.. మూడో టీ20లో మన్కడ్‌కు ట్రై చేసిన చహార్

IND vs SA T20I: ఇటీవల కాలంలో ఇంగ్లీష్ క్రికెట్ లో పెద్ద చర్చనీయాంశమైన దీప్తి శర్మ రనౌట్ వ్యవహారం ఇంకా చల్లారలేదు.  ఈ వివాదం  ఇంకా చల్లారకముందే మరో భారత బౌలర్ దానికి మళ్లీ ఆజ్యం పోశాడు. 

After Deepti Sharma, another Team India Bowler Deepak Chahar Attempts Running Out Tristan Stubbs , Video Went Viral
Author
First Published Oct 5, 2022, 9:17 AM IST

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టీ20లో భారత జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో విఫలమైన రోహిత్ సేన.. అందుకు మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో ఆకట్టుకుని భారత్ కు భారీ ఓటమినుంచి తప్పించిన దీపక్ చహార్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  చహార్.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కాపీ కొట్టబోయాడు. కాస్తలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ను ‘మన్కడ్’ రూపంలో ఔట్ చేయబోయి అతడికి లైఫ్ ఇచ్చాడు. 

వివరాల్లోకెళ్తే.. నిన్నటి మ్యాచ్  లో టాస్ ఓడి దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ కు వచ్చింది. అప్పటికే  రిలీ రోసో,  ట్రిస్టన్ స్టబ్స్ జోరుమీదున్నారు.   అదే క్రమంలో  16వ ఓవర్ వేసిన చహార్.. తొలి బంతిని వేయబోతూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వద్ద ఉన్న స్టబ్స్ ముందుకు వెళ్లడం గమనించాడు. 

రనప్ పూర్తిచేసుకుని వచ్చిన చహార్..  బంతి విసిరేముందు అక్కడే ఆగి  స్టబ్స్ ను రనౌట్ చేయడానికి యత్నించాడు. బంతిని చేతిలో పట్టుకుని వికెట్లకు విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అప్పటికే తేరుకున్న స్టబ్స్.. వెంటనే  బ్యాట్  ను క్రీజులోకి  తెచ్చాడు. అయితే స్టబ్స్ బ్యాట్ లోపల పెట్టడానికంటే ముందే చహార్ వికెట్లను  పడగొట్టే అవకాశమున్నా అతడు అలా చేయలేదు.  స్వీట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

 

ట్విటర్ లో ఈ వీడియో పై జోకులు పేలుతున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ ఈ వీడియోను చూస్తే.. చహార్ ను తప్పకుండా మందలిస్తాడని అర్థం వచ్చేలా మీమ్స్ వెళ్లువెత్తుతున్నాయి. ఈ తరహా రనౌట్ చేసినప్పుడల్లా గుర్తుకు వచ్చే పేరు అశ్వినే కావడం గమనార్హం.  ఐపీఎల్ లో  అశ్విన్.. ఓసారి రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ను ఇదే తరహాలో ఔట్ చేయడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. కొద్దిరోజుల క్రితమే టీమిండియా మహిళా స్పిన్నర్ దీప్తి శర్మ కూడా లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో వన్డేలో  ఆ జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను ఇలాగే ఔట్ చేయడం వివాదాస్పదమైంది.  

ఇదిలాఉండగా  ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేశారు.  రిలే రోసో (48 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీతో మెరవగా క్వింటన్ డికాక్ (68), ట్రిస్టన్ స్టబ్స్ (23) రాణించారు.  అనంతరం భారీ లక్ష్య ఛేదనలో  భారత్.. 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది.  భారత జట్టులో  దినేశ్ కార్తీక్ (46) టాప్ స్కోరర్ కాగా దీపక్ చహార్ (31)  మెరుపులు మెరిపించాడు.  మూడో టీ20  ఓడినా భారత్ తొలి రెండు మ్యాచ్ లు గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.   
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios