ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న క్రికెటర్ శ్రీశాంత్... ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2013సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌కి జీవితకాలం నిషేధం విధించింది బీసీసీఐ.

శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది కేరళ హైకోర్టు. తాను ఏ తప్పు చేయలేదని, పోలీసులే బలవంతంగా స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు అంగీకరించేలా చేశారని చెప్పిన శ్రీశాంత్... ఎట్టకేలకు క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.

జనవరి 10 నుంచి ప్రారంభం కాబోయే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో కేరళ జట్టు తరుపున బరిలో దిగబోతున్నాడు శ్రీశాంత్. కేరళ టీమ్ మేనేజ్‌మెంట్ శ్రీశాంత్‌కి క్యాప్‌ను అందించింది. కేరళ కోచ్ టిను యోహనన్, శ్రీశాంత్‌కి క్యాప్‌ను అందించాడు.

37 ఏళ్ల వయసులో శ్రీశాంత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. కేరళ జట్టుకి సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. 2011లో ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్‌కి శ్రీశాంత్, క్యాప్ అందించడం విశేషం.

క్రికెట్ బ్యాన్ తర్వాత రాజకీయాలు, సినిమాలు, బిగ్‌బాస్ షో వంటి ఎన్నో ప్రయత్నాలు చేసిన శ్రీశాంత్... ఎట్టకేలకు మళ్లీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.