Nari Contractor’s Surgery: భారత మాజీ క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ కు  ముంబై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విజయవంతంగా  శస్త్ర చికిత్స చేశారు. 1962 లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా  చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తో  ఆయన తలకు గాయమైంది. 

1962లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ నారీ కాంట్రాక్టర్.. ఆ సిరీస్ లో తలకు గాయమై అర్థాంతరంగా తప్పుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన ఓ బౌన్సర్.. నేరుగా కాంట్రాక్టర్ తలకు తాకి తీవ్ర రక్తస్రావమైంది. అయితే ఆ సమయంలో ఆయనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యలు.. కాంట్రాక్టర్ తలలో లోహపు ప్లేట్ ను అమర్చారు. ఇప్పుడు సరిగ్గా 60 ఏండ్ల తర్వాత.. కాంట్రాక్టర్ కు తిరిగి శస్త్ర చికిత్స చేసి.. ఆయన తలలోంచి ప్లేట్ ను తీసేశారు ముంబై వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని కాంట్రాక్టర్ కుమారుడు హొషేదార్ తెలిపాడు. 

ప్రస్తుతం 88 ఏండ్ల ఈ మాజీ క్రికెటర్ కు జరిగిన తాజా ఆపరేషన్ గురించి అతడి కుమారుడు వెల్లడిస్తూ.. ‘ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. నాన్న త్వరలోనే ఇంటికి వస్తారు. కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంటే మంచిదని చెప్పడంతో ఇక్కడే ఉంచాం... 

Scroll to load tweet…

గతంలో ఆయన తలలో వేసిన ప్లేట్ ను తీసేసిన చోట చర్మం కోల్పోయాడు. అయితే దానిని తొలగిస్తేనే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు. సహజంగానే ఇంత పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు మా కుటుంబం ఆందోళన చెందింది. అయితే వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన పనేం లేదని చెప్పారు...’ అని తెలిపాడు. 

88 ఏండ్ల కాంట్రాక్టర్ భారత్ తరఫున 31 టెస్టులలో ప్రాతినిథ్యం వహించాడు. 1962 విండీస్ పర్యటన తర్వాత ఆయన అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేకపోయాడు. అసలు ఆ బౌన్సర్ తగిలి ఆయనకు శస్త్రచికిత్స చేసిన తర్వాత కాంట్రాక్టర్ తిరిగి కోలుకోవడమే ఒక సాహసం. ఆ సమయంలో కాంట్రాక్టర్ ఆరు రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న ఆయన.. మళ్లీ ఫస్ట్ క్లాస్ మ్యాచులాడాడు. కానీ తిరిగి అంతర్జాతీయ మ్యాచులలో మాత్రం కనిపించలేదు. 

Scroll to load tweet…

శస్త్రచికిత్స సమయంలో కాంట్రాక్టర్ ప్రాణాలను కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు రక్తదానం చేశారు.. వారిలో వెస్టిండీస్ కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్, చందు బోర్డే, బాపు నద్కర్ణి, పాలీ ఉమ్రిగర్, జర్నలిస్ట్ కెఎన్ ప్రభూలు ఉన్నారు. ఆ ఉదంతం తర్వాత గ్రిఫిత్ పై అంతర్జాతీయంగా విమర్శలొచ్చాయి. కాగా ఓ రోజు కాంట్రాక్టర్ ను చూడటానికి గ్రిఫిత్ భార్య హాస్పటల్ కు వెళ్లగా ఆమెతో ఆయన.. ‘ఈ ఘటనలో గ్రిఫిత్ ను నిందించాల్సిన పన్లేదు.. ఇదంతా నా తప్పు...’ అని చెప్పి విండీస్ క్రికెటర్ల మనసు గెలుచుకున్నాడు.