Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్... సంచలన నిర్ణయం తీసుకున్న నవీన్ వుల్ హక్..

టీ20లకు అందుబాటులో ఉండేందుకు వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన 24 ఏళ్ల ఆఫ్ఘాన్ ప్లేయర్ నవీన్ వుల్ హక్.. 

Afghanistan young pacer naveen ul haq announces retirement for ODI afters ICC World cup 2023 CRA
Author
First Published Sep 28, 2023, 10:35 AM IST | Last Updated Sep 28, 2023, 10:35 AM IST

ఫ్రాంఛైజీ క్రికెట్ మెల్లిమెల్లిగా అంతర్జాతీయ క్రికెట్‌ని మింగేస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్‌కి అందుబాటులో ఉండేందుకు ట్రెంట్ బౌల్డ్, జేమ్స్ నీశమ్ వంటి స్టార్ ప్లేయర్లు, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నారు. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డి కాక్ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. స్టార్ ప్లేయర్లతో పాటు ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న ప్లేయర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది..

తాజాగా 24 ఏళ్ల ఆఫ్ఘాన్ పేసర్ నవీన్ వుల్ హక్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. నవీన్ వుల్ హక్ ఇప్పటిదాకా ఆడిందే 7 వన్డేలు. అందులో 14 వికెట్లు తీసిన నవీన్, సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఫ్రాంఛైజీ క్రికెట్‌పైన ఎక్కువ ఫోకస్ పెట్టడమే కారణం..

‘వరల్డ్ కప్ తర్వాత నేను వన్డేల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా. నా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గర్వకారణం. వన్డేల నుంచి తప్పుకున్నా, టీ20ల్లో మాత్రం ఆడతాను. నా కెరీర్‌ని సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు అన్ని విధాలా సహకరించిన ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుకి, అభిమానులకు ధన్యవాదాలు..’ అంటూ పోస్ట్ చేశాడు నవీన్ వుల్ హక్..

ఐపీఎల్ 2023 సీజన్‌లో నవీన్ వుల్ హక్, లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ సమయంలో నవీన్ వుల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య గొడవైంది. 

ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ, ‘మామిడి పండ్లు బాగున్నాయి.. ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ నవీన్ వుల్ హక్ చేసిన సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. ఆసియా కప్ 2023 టోర్నీలో నవీన్ వుల్ హక్ వర్సెస్ విరాట్ కోహ్లీ చూడవచ్చని అనుకున్నారు అభిమానులు..

అయితే ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన ఆఫ్ఘాన్ జట్టులో నవీన్ వుల్ హక్‌కి చోటు దక్కలేదు. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మాత్రం నవీన్ ఆడబోతున్నాడు. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో నవీన్ వుల్ హక్‌కి తుది జట్టులో చోటు దక్కితే, విరాట్ కోహ్లీ వర్సెస్ నవీన్ మధ్య మరోసారి ఇంట్రెస్టింగ్ ఫైట్ చూడొచ్చని అనుకుంటున్నారు ఫ్యాన్స్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios