బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో పసికూన అప్ఘానిస్తాన్ అద్భుతం చేసింది. బంగ్లా పులులను వారి స్వదేశంలోనే మట్టికరిపించి ఏకంగా 224 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మొదటి మ్యాచ్ లో అప్ఘాన్ సారథ్య బాధ్యతలను నిర్వర్తించిన స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ నిజంగానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి జట్టు సభ్యుల సహకారం అందడంతో సునాయాసంగా అప్ఘాన్ విజయతీరాలకు చేరుకుంది. ఇలా టెస్ట్ జట్టు హోదా పొందిన తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిని గెలిచి అప్ఘాన్ చరిత్ర సృష్టించింది.  

ఐదోరోజు అప్ఘాన్ విజయపుటంచుల్లో నిలిచిన సమయంలో వర్షం మ్యాచ్ అంతరాయం కలిగింది. అయితే చివరకు బోజన విరామం అనంతరం మ్యాచ్ ఆరంభమవగా కేవలం 18.3 ఓవర్లలోనే లాంఛనం పూర్తయ్యింది. అప్ఘాన్ బౌలర్ల ధాటికి  రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లా ఆటగాళ్లు కేవలం 173 పరుగులకే చేతులెత్తేశారు. దీంతో ఏకంగా 223 పరుగుల తేడాతో అప్ఘాన్ ఘన విజయం సాధించి తామింక పసికూనలం కాదని నిరూపించుకుంది. 

ఏకైక టెస్ట్ మ్యాచ్  ద్వారా అప్ఘాన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన రషీద్ ఖాన్ ఆల్ రౌండ్  ప్రదర్శన కనబర్చాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టడమే కాదు ఓ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అతడికి రహ్మత్ షా, అస్ఘర్  అప్ఘాన్,  ఇబ్రహీం జర్దాన్, మహ్మద్ నబీ, జహీర్ ఖాన్ లు చక్కటి సహకారం అందించారు. 

అప్ఘాన్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 342 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేసింది. కానీ బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 205 పరుగులతో కాస్త వెనకబడ్డా  పోరాటాన్ని ప్రదర్శించింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో అదికూడా లేకుండా  కేవలం 173 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో స్వదేశంలో, సొంత ప్రేక్షకుల మధ్య నిన్న మొన్న అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అప్ఘాన్ చేతిలో చిత్తయ్యింది. 

రషీద్ ఖాన్ మొదటి, రెండు ఇన్నింగ్సుల్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 55-5, సెకండ్ ఇన్నింగ్స్ లో 49-6  తో మొత్తం 11 వికెట్లు పడగొట్టి అప్ఘాన్ పతనాన్ని శాసించాడు. ఇతడొక్కడే కాదు జట్టు జట్టంతా సమిష్టిగా రాణించడంతో అప్ఘాన్ మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.