2018 సంవత్సరంలో జరిగిన ఐపిఎల్ సీజన్ 11 లో సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు ఫైనల్ వరకు చేరుతుందని అసలెవ్వరికీ నమ్మకం లేదు. బాల్ ట్యాపరింగ్ వివాదంలో చిక్కుకుని డేవిడ్ వార్నర్ క్రికెట్ నుండి ఏడాదిపాటు నిషేదానికి గురవడంతో ఐపిఎల్లో కూడా ఆడలేకపోయాడు. ఇలా ప్రతిసారి సన్ రైజర్స్ జట్టు గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్న వార్నర్ దూరమవడంతో హైదరాబాద్ అభిమానులు కూడా ఎస్ఆ‌ర్‌హెచ్ పై నమ్మకం కోల్పోయారు. అలాంటి సమయంలో అప్పటివరకు ఎవరికీ పరిచయం లేని అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాయ చేశాడు. ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతూ సన్ రైజర్స్ ని ఏకంగా  ఫైనల్ కి చేర్చాడు. ఇలా అప్పటినుండి రషీద్ ఖాన్ పేరు అంతర్జాతీయ క్రికెట్ లో మారుమోగుతున్న విషయం తెలిసిందే. 

ఇలా అనూహ్యంగా స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ అప్ఘాన్ బౌలర్ తాజాగా తన క్రికెట్ గురువు గురువెవరో బయటపెట్టాడు. తాను  పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదిని చూసే క్రికెటర్ గా మారాలనుకున్నానని...అతడే తన మొదటి గురువని తెలిపాడు. తాను అప్పట్లో అతడి బౌలింగ్ ను అనుసరించేవాడిని. అలా చేయడం వల్లే సక్సెస్ అయ్యాను... కాబట్టి బ్యాటింగ్ లోనూ అనుసరించడం ప్రారంభించాను. ఇలా  మొత్తం తన ఆటతీరంగా  అఫ్రిది ఆటలా మారిపోయిందన్నాడు.  అతడి బౌలింగ్, బ్యాటింగ్ శైలిని కాఫీ కొట్టడం తనకు సిగ్గుగా కాకుండా  గర్వంగా అనిపిస్తుందని రషీద్ పేర్కొన్నాడు. 

''అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా పరుగులు చేయకపోవచ్చు. కానీ రికార్డుల  మోత మోగించాడు. అతడు క్రీజులోకి  వచ్చాడంటే తనలాంటి  అభిమానులు పండగ చేసుకునేవారు. కొద్ది పరుగులే సాధించినా  అందులో అత్యధిక బౌండరీలు వుండేవి. ఇలా అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో అఫ్రిది ముందుండేవాడు. అతడి తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం'' అంటూ రషీద్ ఖాన్ తనకు అఫ్రిదిపై  వున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.