‘ఆదిపురుష్’ సినిమా చూసి, దానిపై తన స్టైల్‌లో రివ్యూ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... ఇలాంటోడు కాబట్టే వీరూని, ధోనీ టీమ్ నుంచి తప్పించాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రభాస్, ఆ రేంజ్‌ని వాడుకోవడంలో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి..
ప్రభాస్, సైఫ్ ఆలీ ఖాన్, కృతి సనన్, దేవ్‌దత్తా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా, జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాని ‘రామాయణం’గా చెప్పుకుంటూ ప్రమోట్ చేసింది చిత్ర యూనిట్...
‘ఆదిపురుష్’ చూడడానికి హనుమంతుడు వస్తాయని, ఆయన కోసం ప్రతీ థియేటర్‌లో ఓ సీటుని ఖాళీగా పెడతామంటూ తెగ ఊదరకొట్టింది. ఇలాంటి ప్రమోషన్‌లతో సినిమాపై హైప్ పెరిగిపోయింది. ఇదే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. దారుణమైన వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ‘రామాయణం’ కథలో తీసుకోవాల్సిన దాని కంటే ఎక్కువ స్వేచ్చ తీసుకుని, ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేశాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్...
సినిమా విడుదల అయ్యాక ఇది ‘రామాయణం కాదు, ఆ కథ నుంచి స్ఫూర్తి పొందాం అంతే...’ అంటూ వ్యాఖ్యానించారు ఓం రౌత్ అండ్ కో.
లంకేశ్‌గా సైఫ్ ఆలీ ఖాన్‌ని చూపించిన విధానం దగ్గర్నుంచి, రాఘవుడిగా ప్రభాస్ లుక్స్ వరకూ ‘ఆదిపురుష్’పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి... అయితే బీభత్సమైన నెగిటివ్ టాక్‌ని తట్టుకుని మొదటి మూడు రోజుల్లో 60 శాతం బడ్జెట్‌ని రికవరీ చేయగలిగింది ‘ఆదిపురుష్’.
మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టగలిగిన ప్రభాస్ ఇమేజ్, వారాంతం ముగిశాక తేలిపోయింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయిన ‘ఆదిపురుష్’ ఈ వీకెండ్‌లో రాబట్టే కలెక్షన్లను బట్టి... సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనేది తేలనుంది...
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ‘ఆదిపురుష్’ సినిమా చూసి, దానిపై తన స్టైల్‌లో రివ్యూ ఇచ్చాడు.
‘ఆదిపురుష్ చూశాక... కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది..’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఎప్పటిలాగే ఈ ట్వీట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్, వీరేంద్ర సెహ్వాగ్‌పై విరుచుకుపడుతున్నారు. వీరూ ఇలాంటోడు కాబట్టే అతన్ని, ధోనీ టీమ్ నుంచి తప్పించి మంచి పని చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు...
ఎప్పటిలాగే ఈ ట్వీట్ కింద టాలీవుడ్ ఫ్యాన్ వార్ నిబ్బాలు ప్రత్యక్షం అయిపోయారు. మావోడు తోపంటే మావోడు తరుము అంటూ అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.
