అంబానీ వర్సెస్ అదానీ.. కార్పొరేట్ దిగ్గజాల మధ్య చిచ్చు పెట్టనున్న బీసీసీఐ.. వేదికలూ ఖరారు..?
WPL 2023: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే ఓ మెగా బ్లాక్ బస్టర్ ఫైట్ కు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు వేదికలను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.

మహిళల క్రికెట్ లో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తున్న బీసీసీఐ.. త్వరలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను అధికారికంగా ప్రారంభించనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీల వేలం ప్రక్రియ ముగిసిన ఈ టోర్నీలో ఈ నెల రెండో వారంలో క్రికెటర్ల వేలం ఉండనుంది. కాగా బోర్డు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 4 నుంచి 26 వరకూ డబ్ల్యూపీఎల్ ను నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ టోర్నీలో తొలి ఫైట్ జరుగబోయేది భారత్ తో పాటు ప్రపంచ కుబేరులుగా ఉన్న గౌతం అదానీ, ముఖేష్ అంబానీ లు సొంతం చేసుకున్న జట్ల మధ్యే కావడం గమనార్హం.
బీసీసీఐ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మార్చి 4 నుంచి ప్రారంభం కాబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబై - అహ్మదాబాద్ మధ్య ఉండనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తున్నది.
భారత కార్పొరేట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న ముఖేష్ అంబానీ, గౌతం అదానీలు డబ్ల్యూపీఎల్ లో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం విదితమే. ముంబై ఫ్రాంచైజీని అంబానీ దక్కించుకోగా అహ్మదాబాద్ (గుజరాత్ జెయింట్స్) ను అదానీ చేజిక్కించుకున్నాడు. కాగా, ఇప్పటికే కావాల్సినంత క్రేజ్ ఏర్పడిన ఈ లీగ్ లో మార్చి 4న జరుగబోయే తొలి మ్యాచ్ ను ఈ రెండు జట్ల మధ్య నిర్వహిస్తే అది ఇంకా టోర్నీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే అవకాశముందని అటు బీసీసీఐతో పాటు ఇటు బ్రాడ్కస్టర్ (జియో.. ఇది కూడా రిలయన్స్ వాళ్లదే) కూడా భావిస్తున్నారట.
అయితే మార్చి 4 - 26 మధ్య జరుగబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేయలేదు. ఆటగాళ్ల వేలం ముగిసిన తర్వాత బీసీసీఐ అన్ని వివరాలను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వేదికలు ఇవే..
డబ్ల్యూపీఎల్ ను నగరాల వారీగా విభజించి ఐదు టీమ్ లు గా చేసినా తొలి ఎడిషన్ ను మాత్రం రెండు వేదికలలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. ముంబైలోని డాక్టర్ డి.వై. పాటిల్ స్టేడియంతో పాటు బ్రబోర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియాన్ని కూడా వాడుకోవాలని చూసినా త్వరలోనే ఐపీఎల్ తో పాటు అంతకంటే ముందే ఇక్కడ ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగాల్సి ఉంది. దీంతో బ్రబోర్న్, డివై పాటిల్ స్టేడియాలనే వేదికలుగా ఉపయోగించుకోనున్నారని తెలుస్తున్నది.