IPL Media Rights: ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఇండియాకు సంబంధించి టెలివిజన్ ప్రసారాలు సోనీ నెట్వర్క్ (?) కు దక్కినట్టు వార్తలు వస్తున్నాయి. డిజిటల్ హక్కులను వయాకమ్ దక్కించుకుంది.
గతంలో పదేండ్ల పాటు ఐపీఎల్ మీడియా హక్కులను కలిగి ఉన్న సోనీ నెట్వర్క్ మళ్లీ 2023-27 కాలానికి కూడా దక్కించుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వచ్చే ఐదేండ్ల సీజన్స్ కోసం బీసీసీఐ.. ఆదివారం ప్రారంభించిన వేలం ప్రక్రియను సోమవారం కూడా కొనసాగిస్తున్నది. అయితే ఐపీఎల్ టీవీ ప్రసారహక్కులను సోనీ నెట్వర్క్ దక్కించుకున్నట్టు వార్తలు రావడంతో సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు.. ‘మళ్లీ మంచి రోజులొచ్చాయి’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
2007 నుంచి 2018 వరకు ఐపీఎల్ ప్రసారాలు సోనీలోనే వచ్చేవి. కానీ 2017-2022 వరకు వీటిని స్టార్ నెట్వర్క్ దక్కించుకుంది. అయితే సోనీతో పోల్చితే స్టార్ లో ప్రసారాలు బాగోలేవని అభిమానులు బహిరంగంగానే పెదవి విరిచారు.
ఇక వచ్చే ఐదేండ్ల సీజన్ లో ఇవి తిరిగి సోనీకి దక్కడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ట్విటర్ లో పలువురు అభిమానులు ట్వీట్ చేస్తూ ‘అచ్చేదిన్ ఈజ్ బ్యాక్..’, ‘ఐపీఎల్ ను సోనీలో చూస్తేనే అసలు మజా..’ ‘ఐపీఎల్ మళ్లీ సోనీలో.. ఇంతకంటే ఆనందం ఇంకేముంది..? ఇది పండుగల చేసుకోవాల్సిన సమయం’ అని ట్వీట్లు చేస్తున్నారు.
డిజిటల్ హక్కులు వయాకమ్ కు..
ఐపీఎల్ మీడియా హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఈ వేలం ప్రక్రియలో ఎ (ఇండియాలో టెలివిజన్ ప్రసారాలు) రూ. రూ. 23,575 కోట్లు (ఒక్కో మ్యాచ్ కు రూ. 57.5 కోట్లు), ప్యాకేజీ బి-రూ. 19,680 కోట్ల (రూ. 48 కోట్లు)కు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఎ, బి లు కలిసి రూ. 43,255 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.
ఎ, బి ప్యాకేజీలలో కలిపి ఒక్కో మ్యాచ్ విలువ ఏకంగా రూ. 107.5 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సి(ప్లేఆఫ్స్, కొన్ని ప్రత్యేక మ్యాచ్ లు), డి (ఉపఖండం వెలుపల) కి వేలం జరుగుతున్నది. నేటి సాయంత్రంతో వేలం ముగుస్తుంది. సాయంత్రం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
