Asianet News TeluguAsianet News Telugu

అదెప్పుడో పంపాం.. మీరు చూడకుంటే మేమేం చేసేది..? జై షా పై పీసీబీ చీఫ్ కామెంట్స్‌కు ఏసీసీ స్పందన

INDvsPAK: ఆసియా కప్ - 2023 నిర్వహణాంశం మరోసారి చర్చకు దారి తీసింది.  2023-24  ఏడాదులకు గాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)  అధ్యక్షుడి హోదాలో   జై షా చేసిన ట్వీట్ తో మరోసారి  ఇది చర్చనీయాంశమైంది. 
 

ACC Responds Najam Sethi Comments Over Jay Shah, Says Calendar  was Emailed in December Last Year  to PCB
Author
First Published Jan 6, 2023, 5:44 PM IST

2023 తో పాటు వచ్చే ఏడాది ఆసియా వ్యాప్తంగా  నిర్వహించదలచిన మ్యాచ్ లు, షెడ్యూల్ కు సంబంధించిన  వివరాలను  ఏసీసీ అధ్యక్షుడు జై షా గురువారం ట్విటర్ లో  షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్వీట్  పై పాకిస్తాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ గా ఉన్న  నజమ్ సేథీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.  జై షా   సభ్య దేశాలను అడగకుండానే ఏకపక్షంగా  ఈ షెడ్యూల్ ప్రకటించాని ఆయన ఆరోపించాడు. అంతేగాక ఏసీసీ అధ్యక్షుడి హోదాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 షెడ్యూల్ కూడా ప్రకటించాలని జై షాను వ్యంగ్యంగా కోరాడు. 

నజమ్ సేథీ వ్యాఖ్యలపై ఏసీసీ  స్పందించింది. ఓ ప్రకటనలో ఏసీసీ.. సేథీ చేసిన  ఆరోపణలు నిరాధారం అని కొట్టిపడేసింది.  2023-24 కు  గాను షెడ్యూల్ ను  ఏసీసీలోని డెవలప్మెంట్ కమిటీ,  ఫైనాన్స్, మార్కెంటింగ్ కమిటీలు  చర్చించి తీసుకున్న నిర్ణయమని ప్రకటించింది.  

ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీసీలోని సభ్య దేశాలన్నింటికీ గతడేది డిసెంబర్ లోనే పంపామని తెలిపింది.  2022 డిసెంబర్ లోనే ఈ వివరాలను  పీసీబీకి ఈమెయిల్ చేశామని,  కావాలంటే చెక్ చేసుకోవచ్చునని  సూచించింది. ఇదిలాఉండగా.. సేథీ  ఇటీవలే పీసీబీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.  ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ వరకూ  పీసీబీకి రమీజ్ రాజా చీఫ్ గా ఉండేవాడు. కానీ  అతడి వ్యవహార శైలి పై మాజీ క్రికెటర్ల అసంతృప్తి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడనే ఆరోపణలతో అతడిని పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను నజమ్ సేథీకి అప్పగించింది పాకిస్తాన్ ప్రభుత్వం. 

గురువారం జై షా తన ట్వీట్ లో.. ‘‘2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ  క్రికెట్ క్యాలెండర్ ను   మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను  మా అసమానమైన ప్రయత్నాలను ఇది  సూచిస్తుంది...’అని  పేర్కొన్నాడు. దీనికి కౌంటర్ గా సేథీ.. ‘2023-2024కు సంబంధించిన షెడ్యూల్ ను ఏకపక్షంగా ప్రకటించినందుకు  థాంక్యూ జై షా.. మీరు ఏసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి మీకు  ప్రస్తుత  పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) 2023 క్యాలెండర్ గురించి కూడా తెలిసే ఉంటుంది. దానిని కూడా మీరు ప్రదర్శించవచ్చు..’ అని వ్యంగ్యంగా  ట్వీట్ చేశాడు.  

 

కాగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల వివాదం కారణంగా 2013 నుంచి భారత్ - పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేవు.  అదీగాక ఈ ఏడాది  ఆసియా కప్ పాకిస్తాన్ లో నిర్వహిస్తే తాము  అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని.. తటస్థ వేదికపై అయితేనే ఆడతామని  జై షా గతంలో ప్రకటించాడు. దీనికి పాకిస్తాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ఈ వాదోపవాదాలు  సాగుతుండగానే నిన్న జై షా  తన ట్విటర్ లో షెడ్యూల్ ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది.

Follow Us:
Download App:
  • android
  • ios