Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కు ఆ ఉద్దేశ్యం లేదు, దయచేసి కోహ్లీని వివాదాల్లోకి లాగకండి...

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా, కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు డైరెక్టర్‌గా విరాట్‌ కోహ్లి జోడు పదవులు అనుభవిస్తూ విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ డికె జైన్‌కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. 

Absurd allegations against Virat Kohli based on conjectures: Cornerstone CEO
Author
Mumbai, First Published Jul 8, 2020, 4:55 PM IST

ఏవో స్వార్థ ప్రయోజనాల కోసమే ఇతరులు విరాట్‌ కోహ్లిని అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని కార్నర్‌స్టోన్‌ కంపెనీ సీఈఓ బంటీ సజ్దే విమర్శించారు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా, కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు డైరెక్టర్‌గా విరాట్‌ కోహ్లి జోడు పదవులు అనుభవిస్తూ విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ డికె జైన్‌కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. 

మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) లైఫ్ మెంబెర్ సంజీవ్‌ గుప్తా ఈ మేరకు విరాట్‌ కోహ్లిపై ఫిర్యాదు చేయటం జరిగింది. విరాట్‌కోహ్లిపై విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు నిరాధారమని, అరకొర సమాచారంతో చేసిన ఫిర్యాదుగా కోహ్లీ పై వచ్చిన ఫిర్యాదును బంటీ సజ్దే కొట్టిపారేశారు. 

' తాజాగా విరాట్‌ కోహ్లిపై వచ్చిన విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది. ప్రతి అంశంలో విరాట్‌ కోహ్లిని ఎటువంటి ఆధారాలు లేకుండానే వివాదాల్లోకి లాగాలని చూడటం దురదృష్టకరం. విరుద్ధ ప్రయోజనాల ఊహాగానాలు పూర్తిగా కల్పితం, అంతకుమించి ఏమీ లేదు. ఇతర క్రికెటర్ల మాదిరిగానే విరాట్‌ కోహ్లితో మేము కాంట్రాక్టు కుదుర్చుకున్నాం. బాధ్యతాయుత కంపెనీగా మేము మరోసారి చెబుతున్నాం. విరాట్‌ కోహ్లి ఎటువంటి విరుద్ధ ప్రయోజనాలు పొందటం లేదు. ఇతర ప్రయోజనాలు ఆశిస్తోన్న బయటి వ్యక్తులు మరోలా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడానికి ముందు, వాస్తవాలు పరిశీలించుకోవాలని వారికి మరోసారి మనవి చేస్తున్నాను' అని బంటీ సజ్దే ఓ ప్రకటనలో పేర్కొన్నాడు

2017లో సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. 

బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్ లేదా ఉద్యోగి.. బోర్డుతో అనుబంధంగా ఉన్న ఏ సంస్థల్లోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామిగా ఉండకూడదనేది నిబంధన. ఇప్పడు ఆ సెగ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగిలింది. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్‌ఎల్‌పి కంపెనీ డైరెక్టర్‌గా ఉండటంతో పాటు కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇలా రెండు కంపెనీలకు డైరెక్టర్ హోదాలో ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా తాజాగా బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్‌కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అందులో తాను స్వప్రయోజనాల కోసం ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసిన సంజీవ్ గుప్తా.. లోధా కమిటీ పేర్కొన్న క్లాజ్‌ల్లోని నిబంధనల్ని అందులో ప్రస్తావించాడు. ఒకవేళ విరాట్ కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాలుంటే.. ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

కాగా.. కోహ్లీకి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తున్నట్లు జస్టిస్ జైన్ తెలిపారు. తమకు కోహ్లీపై ఫిర్యాదు అందిందని.. దానిని పరిగణలోకి తీసుకోవాలో వద్దో తాము పరిశీలిస్తామని చెప్పారు. ఒక వేళ ఈ ఫిర్యాదుపై పరిశీలించే అవకాశం ఉంటే.. దీనిపై వివరణ ఇచ్చేందుకు కోహ్లీకి అవకాశం ఇస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios