SL vs PAK: శ్రీలంక-పాకిస్తాన్ మధ్య గాలే వేదికగా  జరుగుతున్న తొలి టెస్టులో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్  జట్టు విజయానికి చేరువలో ఉంది.  

శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ తొలి టెస్టులో విజయానికి బాటలు పరుచుకుంది. శ్రీలంక-పాకిస్తాన్ మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆ జట్టు విజయం వైపునకు పయనిస్తున్నది. శ్రీలంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు ఇప్పటికే 70 శాతం పరుగులను కరిగించింది. ప్రస్తుతం పాకిస్తాన్.. 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫిక్ (289 బంతుల్లో 112 బ్యాటింగ్.. 5 ఫోర్లు, 1 సిక్సర్), మహ్మద్ రిజ్వాన్ (12 బంతుల్లో 7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి టెస్టులో విజయానికి ఆ జట్టుకు కావాల్సినవి 90 ఓవర్లలో 120 పరుగులే.

రెండో ఇన్నింగ్స్ లో లంక 337 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దినేశ్ చండిమాల్ (94 నాటౌట్..5 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని లంక టెయిలెండర్లు అతనికి ఇవ్వలేదు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని లంక మొత్తంగా పాక్ ముందు 342 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

రెండు రోజుల్లో 342 పరుగులను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ కు ఓపెనర్లు అబ్దుల్లా షపీక్, ఇమామ్ ఉల్ హక్ (35) తొలి వికెట్ కు 87 పరుగులు జోడించాడు. అతడిని రమేశ్ మెండిస్ ఔట్ చేశాడు. ఆ తర్వాత అజర్ అలీ (6) త్వరగానే నిష్క్రమించాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో అలీ.. ధనంజయ డి సిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

Scroll to load tweet…

త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన పాక్ సారథి బాబర్ ఆజమ్ (104 బంతుల్లో 55.. 4 ఫోర్లు, 1 సిక్సర్), షఫీక్ తో కలిసి మూడో వికెట్ కు 101 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో బాబర్.. టెస్టులలో తన 22వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆట నాలుగో రోజు ముగుస్తుందనగా జయసూర్య.. బాబర్ ను బౌల్డ్ చేశాడు. దీంతో పాకిస్తాన్.. 205 పరుగుల వద్ద మూడోవికెట్ కోల్పోయింది.

Scroll to load tweet…

ఈ టెస్టులో గెలవాలంటే లంక ఏదైనా అద్భుతమే చేయాలి. అయితే పది రోజుల క్రితం ఇదే గాలే మైదానంలో ఆస్ట్రేలియాను నాలుగో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జయసూర్య మీదే లంక ఆశలు పెట్టుకుంది. ఆ టెస్టులో అతడు ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. మరి పాకిస్తాన్ తో తొలి టెస్టులో చివరి రోజు అతడేమైనా అద్భుతాలు చేస్తాడేమో వేచి చూడాల్సిందే.