SL vs PAK: శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ తొలి టెస్టును విజయంతో ప్రారంభించింది. వర్షం అంతరాయం కలిగించినా ఈ మ్యాచ్ లో పాక్ విజయాన్ని ఆపలేకపోయింది. 

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన శ్రీలంక-పాకిస్తాన్ తొలి టెస్టులో పర్యాటక జట్టునే విజయం వరించింది. గాలే వేదికగా ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్.. లంకను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఓడినా లంక మాత్రం చివరివరకు పోరాడింది. అంత తేలిగ్గా లొంగకుండా బంతిబంతికి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. అయితే ఆ జట్టు ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (408 బంతుల్లో 160 నాటౌట్.. 7 ఫోర్లు, 1 సిక్సర్) మొక్కవోని దీక్షతో ఆడి పాక్ కు విజయాన్ని అందించాడు. 

342 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 222-3తో ఐదో రోజు ప్రారంభించిన పాకిస్తాన్ కు మహ్మద్ రిజ్వాన్ (74 బంతుల్లో 40.. 2 ఫోర్లు) షఫీఖ్ లు నాలుగో వికెట్ కు 71 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని ప్రభాత్ జయసూర్య విడదీశాడు. అతడు వేసిన 103.1 ఓవర్లో రిజ్వాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

అదే క్రమంలో లంక.. అఘ సల్మాన్ (12), హసన్ అలీ (5) వికెట్లను కూడా పడగొట్టింది. 303 కు పాక్ 6 వికెట్ల నష్టపోవడంతో పాటు పిచ్ కూడా స్పిన్ కు అనుకూలించడంతో లంక శిబిరంలో ఆశలు రేగాయి. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ డ్రా కు దారితీస్తుందా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.

కానీ కొద్దిసేటి తర్వాత వర్షం ఆగిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. అయితే మరే ఇతర సంచలనాలను అవకాశమివ్వకుండా షఫీఖ్ మ్యాచ్ ను ముగించాడు.ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన అబ్దుల్లా షఫీఖ్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఇక సిరీస్ లో నిర్ణయాత్మక రెండో టెస్టు ఇదే వేదికపై జులై 24 నుంచి ప్రారంభం కానుంది. 

Scroll to load tweet…

స్కోరు వివరాలు : శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 222, రెండో ఇన్నింగ్స్ : 337 
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ : 218, రెండో ఇన్నింగ్స్ : 344-6

Scroll to load tweet…