The 6ixty: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతున్న ‘ది సిక్స్టీ’ లీగ్ మీద  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీ20 వల్ల ఆటలో నాణ్యత దెబ్బతింటుందన్న ఆరోపణలతో తాజాగా..  

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) వచ్చే ఆగస్టులో టీ10 లీగ్ ప్రారంభించబోతున్నది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో మొదలుకాబోతున్న ఈ అప్ కమింగ్ లీగ్ లో నిబంధనలు, కొత్తగా చేస్తున్న మార్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్రికెట్ మనుగడకే సవాల్ విసురుతుందని పలువురు వాపోతున్నారు. తాజాగా ఈ లీగ్ పై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు. క్రికెట్ లో ఇంకెన్ని మార్పులు చేస్తారని అతడు ప్రశ్నించాడు. 

చోప్రా మాట్లాడుతూ.. ‘‘గతంలో టెస్టు మ్యాచులు విరివిగా ఆడేవారు. ఐదు రోజుల పాటు సాగే ఆ ఆటలో ఏదో ఒక జట్టుది విజయమో లేక డ్రా గానో ముగిసేది. దాని తర్వాత వన్డే క్రికెట్ వచ్చింది. మొదలు అది 60 ఓవర్లుండగా ఆ తర్వాత దానిని 50 ఓవర్లకు కుదించారు.. 

కొద్దిరోజులకు టీ20లు వచ్చాయి. ఇప్పుడంతా దాని హవానే నడుస్తున్నది. ఇక ఇప్పుడు టీ10 అని కొత్త ఫార్మాట్ రాబోతున్నది. ఆటలో ఇంకెన్ని మార్పులు చేస్తారనేది నా ప్రశ్న.. ఈ ఆటలో 45 నిమిషాల్లోనే పది ఓవర్లు పూర్తి చేయాలని నిబంధన ఉంది. ఒకవేళ బౌలింగ్ చేసే జట్టు 45 నిమిషాల లోపు పది ఓవర్లు వేయకుంటే ఒక ఫీల్డర్ ను తీసేస్తారు. ఇది మంచిదే. బౌలింగ్ చేసే జట్టు క్రమశిక్షణగా ఆడే అవకాశముంది.. 

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘మిస్టరీ ఫ్రీ హిట్’ అని కొత్త అంశాన్ని చేరుస్తున్నారు. దీనిని మ్యాచ్ ను ఆన్లైన్ ద్వారా చూసే ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఏదో ఒక ఓవర్లో బౌలర్ బౌలింగ్ చేస్తుండగా సడెన్ గా బిగ్ స్క్రీన్ మీద మిస్టరీ ఫ్రీ హిట్ అని కనబడుతుంది. దాంతో బౌలర్ తాను చేసిన తప్పేంటో అని బిత్తరపోతాడు..’’ అని తెలిపాడు. 

కాగా వచ్చే ఆగస్టు 24 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ లీగ్ కు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ టోర్నీలో సీపీఎల్ లో పాల్గొంటున్న ఆరు మెన్స్ టీమ్స్, 3 ఉమెన్స్ టీమ్స్ పాల్గొంటాయి. సెయింట్ కిట్స్ వేదికగా (ఆగస్టు 24 నుంచి) ఈ టోర్నీ జరుగుతుంది. 

ఈ లీగ్ లో కొత్త నిబంధనలు : 

- సాధారణ క్రికెట్ లో మాదిరిగా ఇందులో ఒక ఇన్నింగ్స్ కు పది మంది బ్యాటింగ్ చేయరు. బ్యాటింగ్ కు వచ్చేది ఆరుగురు బ్యాటర్లే.. 
- బ్యాటింగ్ చేస్తున్న టీమ్ తొలి ఓవర్లో రెండు సిక్సర్లు కొడితే వాళ్లకు థర్డ్ పవర్ ప్లే అందుబాటులోకి వస్తుంది. రెండు సిక్సర్లు కొట్టలేని పక్షంలో మూడో పవర్ ప్లే ఉండదు. 
- ప్రస్తుతం ఓవర్ ఓవర్ కు మధ్యలో ఫీల్డింగ్ ఛేంజ్, వికెట్ కీపర్ వేరే ఎండ్ మళ్లడం వంటివి ఇందులో ఉండవు. ఒకే ఎండ్ నుంచి వరుసగా ఐదు ఓవర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. 
- 45 నిమిషాల్లో పది ఓవర్లు వేయలేకుంటే చివరి ఆరు బంతులు వేసేప్పుడు బౌలింగ్ టీమ్ నుంచి ఒక ఫీల్డర్ ను తీసేస్తారు. అంటే బౌలర్, కీపర్ పోను ఫీల్డింగ్ చేసేది 8 మందే. 
- ఫ్యాన్స్ కోసం మిస్టరీ ఫ్రీ హిట్.