SL vs PAL: ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లకు కొదవలేదు. సంప్రదాయకంగా ఇక్కడ పేసర్ల కంటే స్పిన్నర్లే ఎక్కువగా పుట్టుకొస్తున్నారు, తరానికొకరు చొప్పున దేశానికి ఒక్క స్పిన్నర్ అయినా స్టార్ స్పిన్నర్లుగా మారుతున్నారు.
ఆడుతున్నది మూడో టెస్టు. ఆడేది అల్లా టప్పా జట్లైతే కాదు.. ఆడింది అత్యంత క్లిష్ట పరిస్థితులలో.. కానీ ప్రత్యర్థి జట్లను ఆటాడించాడు ఆ స్పిన్నర్. మూడు టెస్టులలో ఏకంగా 29 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో ముప్పుతిప్పలు పెట్టాడు. తీవ్ర రాజకీయ, ఆర్థిక రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు టెస్టులలో ఊరట విజయాలు అందిస్తున్న ఆ స్పిన్నర్ పేరు ప్రభాత్ జయసూర్య. లంక నుంచి ఎగిరిపడుతున్న మరో స్పిన్ కెరటం జయసూర్య. ముత్తయ్య మురళీధరన్, రంగనా హెరాత్ తర్వాత ఆ స్థాయి స్పిన్నర్ కోసం వెతుకుతున్న లంకకు జయసూర్య రూపంలో ఓ ప్రభా(త్)తం (వెలుగు) దొరికినట్టేనా..?
సంప్రదాయకంగా ఉపఖండపు పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. ఇక్కడి వాతావరణ పరిస్తితులు, గ్రౌండ్స్, ఇతరత్రా విషయాలెన్నో స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. భారత్ తో పాటు లంకలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులేమీ లేవు. అందుకే ఈ రెండు దేశాల నుంచి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు తయారవుతున్నారు.
లంకలో స్పిన్ దిగ్గజాలకేం కొదవలేదు. 1890లో సిలోన్ (అప్పటి లంక పేరు) బౌలర్ టామీ కెలరట్ క్లబ్ క్రికటె లో వెయ్యి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ జాబితాలో సోమచంద్ర డిసిల్వ, గామిని గూనెసెన, దిల్వుర పెరెరా, లూసియన్ డిసౌజా లు నాటి తరంలో దిగ్గజాలుగా వెలుగొందారు.
ఇక 1980-90లలోకి వస్తే అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్, ఉపుల్ చందన, అజంతా మెండిస్, రంగనా హెరాత్ వంటి మేటి స్పిన్నర్లను అందించింది లంక. అయితే రంగనా హెరాత్ తప్పుకున్నాక ఆ జట్టు స్పిన్ విభాగం కుంటుపడింది. దాదాపు దశాబ్దకాలంగా లంక బౌలింగ్ లో నిఖార్సైన స్పిన్నర్ లేని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
నేనున్నానంటూ..
గడిచిన కొంతకాలంగా శ్రీలంకకు వనిందు హసరంగ అద్భుత ప్రదర్శనలు చేస్తూ లంక స్పిన్ పై ఆశలు రేపుతున్నాడు. అయితే అతడు పరిమిత ఓవర్లలోనే ఆడుతున్నాడే తప్ప ఇంకా టెస్టులలో రెగ్యులర్ ఆటగాడిగా లేడు. కానీ ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తానని దూసుకొస్తున్నాడు ప్రభాత్ జయసూర్య.
ఆడింది మూడు టెస్టులే..
వన్డేలలో 2018లోనే అరంగేట్రం చేసిన ఈ 30 ఏండ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుతో ఈ ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో గాలే వేదికగా ముగిసిన రెండో టెస్టులో జయసూర్య ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తో తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టు గెలిచిందంటే అది జయసూర్య వల్లే అని చెప్పక తప్పదు.
పాకిస్తాన్ కు చుక్కలు..
ఆసీస్ తో అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన జయసూర్యకు పాకిస్తాన్ తో రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. అతడు తొలి టెస్టులో 5, 4 (మొత్తం 9) వికెట్లు పడగొట్టాడు. ఇక గురువారం ముగిసిన రెండో టెస్టులో కూడా 8 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ చేతిలో తొలి టెస్టులో భంగపడ్డా రెండో టెస్టులో లంకకు ఊరట విజయం అందించి సిరీస్ ను సమం చేశాడు. ఈ సిరీస్ లో భాగంగా అతడు.. ప్రపంచ దిగ్గజ బ్యాటర్ గా గుర్తింపు పొందుతున్న బాబర్ ఆజమ్ ను మూడు సార్లు ఔట్ చేయడం గమనార్హం.
- గడచిన ఆరు ఇన్నింగ్స్ లో జయసూర్య ప్రదర్శన ఇది :
6-118, 6-59, 5-82, 4-135, 3-80, 5-117
మొత్తంగా ఆడిన మూడు టెస్టులలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జయసూర్య (29) 3వ స్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాలలో నరేంద్ర హీర్వానీ (31), చార్లీ టర్నర్ (29) ఉన్నారు.
