వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా పివి సింధు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మరింత పెంచిన ఆమెకు ఫ్యాన్ పాలోయింగ్ కూడా మరింత ఎక్కువయ్యింది. అలా ఈ తెలుగు తేజం కు తమిళనాడుకు చెందిన రామనాథం కూడా అభిమానిగా మారిపోయాడు. ఆ అభిమానం కాస్త ముదిరి సింధుతో తన పెళ్లి చేయాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించుకునే స్థాయికి చేరింది. 

ఈ వింత సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుతలోని రామనాథపుర కలెక్టరేట్ లో ప్రజా సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో స్థానిక  కలెక్టర్, అధికారులు బిజీబిజీగా వున్నారు. తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి చాలా మంది అక్కడికి  చేరుకున్నారు. వీరు ఒక్కోక్కరుగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి  పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే మలైస్వామి అనే 70ఏళ్ల వృద్దుడే అందించిన వినతిపత్రాన్ని చూసి ఆశ్యర్యపోవవడం కలెక్టర్ వంతయ్యింది. 

తాను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు పెద్ద ఫ్యాన్ అంటూనే ఆమెపై మనసు పారేసుకున్నట్లు పేర్కొన్నాడు. అందువల్ల సింధుతో తన పెళ్లి చేయించాలని కోరాడు. ఒకవేళ తన అభ్యర్థనను తిరస్కరించి పెళ్లి ఏర్పాట్లు చేయకుంటే సింధును కిడ్నాప్ చేసిమరీ  పెళ్లాడతానంటూ బెదిరించాడు. మలైస్వామి  కలెక్టర్ కు అందించిన పిటిషన్ కు తన ఫోటోతో పాటు సింధు పోటోను జతచేసి సమర్పించడం గమనార్హం.