ఒకే ఓవర్ లో 5 వికెట్లు.. మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్.. ఏవరీ భారత ప్లేయర్?
Abhimanyu Mithun : భారత జట్టు తరఫున 4 టెస్టులు, 5 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టులో 9 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. కానీ, ఈ బౌలర్ ఒకే ఓవర్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు.
Abhimanyu Mithun : క్రికెట్‌లో తమ దేశం కోసం ఆడాలనేది ప్రతి ఒక్కరి కల. కొంతమంది ఆటగాళ్ళు ఈ విషయంలో విజయం సాధిస్తారు. మరికొంతమంది ఎవరూ సాధించలేని విధంగా రికార్డుల మోత మోగిస్తారు. కొంత మంది అదృష్టం కలిసి రాక వెలుగులోకి రాకుండా పోయారు. ఈ రోజు మనం అలాంటి ఒక భారతీయ బౌలర్ గురించి తెలుసుకోబోతున్నాము. అతని అంతర్జాతీయ కెరీర్ చాలా తక్కువగా ఉండవచ్చు, కానీ అతను క్రికెట్‌లో పెను సంచలనం.. క్రికెట్‌లో హ్యాట్రిక్ అనేది ఏ బౌలర్‌కైనా కల. కానీ, ఈ బౌలర్ ఏకంగా మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించాడు. అతనే అభిమన్యు మిథున్.
భారత్ తరఫున 4 టెస్టులు, 5 వన్డేలు
భారత ఆటగాడు అభిమన్యు మిథున్ మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించిన ప్లేయర్. దేశవాళీ క్రికెట్‌లో మిథున్ ఈ ఘనత సాధించాడు. ఇది మాత్రమే కాదు, ఒకసారి అతను టీ20లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించడం అద్భుతం కాదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో ఇంత గొప్ప విజయాలు సాధించినా అభిమన్యు మిథున్ అంతర్జాతీయ కెరీర్ అంత గొప్పగా లేదు. అతను భారత్ తరఫున 4 టెస్టులు, 5 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టులో 9 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు.
అరంగేట్రంలో అద్భుతాలు..
అభిమన్యు మిథున్ తన రంజీ కెరీర్‌ను ప్రారంభంలో అదరిపోయే ప్రదర్శనలు ఇచ్చాడు. నవంబర్ 2009లో అతను కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. ఉత్తరప్రదేశ్‌తో ఆడిన తన మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 60వ ఓవర్‌లో వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. పీయూష్ చావ్లా, అమీర్ ఖాన్, ఆర్పీ సింగ్‌లకు పెవిలియన్ చేర్చాడు.
పుట్టినరోజున ప్రత్యేక బహుమతి
మిథున్ 25 అక్టోబర్ 2019న ఒక చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. తన పుట్టినరోజును గుర్తుండిపోయేలా విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అతను తన జట్టు టైటిల్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో వరుసగా మూడు బంతుల్లో తమిళనాడుకు చెందిన షారుక్ ఖాన్, మహ్మద్ మహ్మద్, మురుగన్ అశ్విన్‌లను అవుట్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఒకే ఓవర్‌లో 5 వికెట్లు..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు అభిమన్యు మిథున్. హిమాన్షు రాణా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రా వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లను ట్రాప్ చేయడంతో మిథున్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. కాగా, అభిమన్యు మిథున్ 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైరయ్యాడు. గతేడాది డిసెంబర్‌లో అబుదాబిలో జరిగిన టీ10 లీగ్ మ్యాచ్‌లో మిథున్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఒక మ్యాచ్‌లో, అతను లాంగ్ నో బాల్ బౌలింగ్ చేశాడు, దాని కారణంగా అతను వివాదానికి గురయ్యాడు.