41 ఏళ్ల వయసులో ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్.. మూడేళ్లుగా టాప్ ప్లేస్‌లో ఉన్న ప్యాట్ కమ్మిన్స్‌కి షాక్ ఇచ్చిన జిమ్మీ... టాప్ 2లో రవిచంద్రన్ అశ్విన్.. 

35 ఏళ్లు దాటిన తర్వాత క్రికెట్ ఆడడమంటే మామూలు విషయం కాదు. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ అంటే ఏదోలా నెట్టుకురావచ్చేమో కానీ ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. అందుకే లెజెండరీ ఫాస్ట్ బౌలర్లు చాలామంది 35 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలేనని నిరూపిస్తూ, 40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్...

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 7 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, వరుసగా 21 ఏళ్లుగా ప్రతీ ఏటా టెస్టు వికెట్ తీసిన మొట్టమొదటి బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ పర్ఫామెన్స్, టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి ఎగబాకాడు జేమ్స్ అండర్సన్...

నాలుగేళ్లుగా 1466 రోజుల పాటు ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా ఉన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, జిమ్మీ దూకుడు ముందు తలవంచాల్సి వచ్చింది. అదీకాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ప్యాట్ కమ్మిన్స్ బౌలర్‌గా పూర్తిగా విఫలం కావడం అండర్సన్‌కి బాగా కలిసి వచ్చింది...

జేమ్స్ అండర్సన్ 866 పాయింట్లతో నెం.1 టెస్టు బౌలర్‌గా ఉంటే రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం జేమ్స్ అండర్సన్‌కి, రవిచంద్రన్ అశ్విన్‌కి కేవలం 2 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇండోర్‌లో జరిగే టెస్టులో అశ్విన్ అదరగొడితే, నెం.1 టెస్టు బౌలర్‌గా నిలవచ్చు...అయితే న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టులో జేమ్స్ అండర్సన్ తీసే వికెట్ల కంటే రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువ వికెట్లు తీయగలగాలి. అప్పుడు టెస్టు నెం.1 బౌలర్‌గా నిలుస్తాడు.

గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా టాప్ 5లో ఉండగా రెండు టెస్టుల్లో 17 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. టాప్ 9లోకి దూసుకొచ్చాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంటే, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లోనూ రెండు హాఫ్ సెంచరీలు బాదిన అక్షర్ పటేల్, టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 5కి ఎగబాకాడు..

టెస్టు బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌లో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదు. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కి దూరమైన రిషబ్ పంత్, ఆరో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు..

తొలి రెండు టెస్టుల్లో ఫెయిలైనా కొన్ని రేటింగ్ పాయింట్లు కోల్పోయిన మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్... టాప్ 1,2 స్థానాలను మాత్రం నిలుపుకోగలిగారు. స్టీవ్ స్మిత్ మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఫెయిల్ అయితే, బాబర్ ఆజమ్ టాప్ 2లోకి వెళ్తాడు..

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ టాప్‌లో ఉంటే, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 6, విరాట్ కోహ్లీ 7, రోహిత్ శర్మ 9వ స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నాడు.