టీ20 వరల్డ్ కప్ కోసం.. క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సిరీస్ భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనపడటం లేదు. దేశంలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ వైరస్ నేపథ్యంలో ఎంతో పకడ్భందీ ఏర్పాట్లతో నిర్వహించిన ఐపీఎల్ వాయిదా పడింది. ఇలాంటి సమయంలో.. టీ20 వరల్డ్ కప్ భారత్ లో నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. భారత్ కి  ఐసీసీ( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) డెడ్ లైన్ ప్రకటించింది. భారత్ లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు వీలౌతుందో లేదో అన్న విషయాన్ని బీసీసీఐ జూన్ 28వ తేదీ నాటికి చెప్పాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు డెడ్ లైన్ ప్రకటించింది.

జూన్ 1న వర్చువల్ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా పాల్గొన్నారు. టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ - నవంబర్ నెలలోనే నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గంగూలీ ఐసీసీ అధికారులకు తెలిపాడు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో నిర్వహించడం సాధ్యమవుతుందా లేదో నిర్ణయం తీసుకోవడానికి గడువు కోరగా జూన్ 28 వరకు సమయం ఇచ్చారు. సమావేశం అనంతరం ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి తమకు జూన్ 28 వరకు ఐసీసీ గడువు ఇచ్చిందని సౌరవ్ గంగూలీ  వెల్లడించారు.

కరోనా ప్రభావం తగ్గకపోతే.. భారత్ లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. మరో రెండు వేధికలను సిద్ధం చేసుకుంటున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ లో కుదరకపోతే యూఏఈ కానీ.. ఒమన్ లోకానీ.. వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం ఉంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.