ప్రస్తుత యువతకు 1983 ప్రపంచ కప్ విజయం ఎలా ఉంటుందో కూడా తెలీదు. 2011 ప్రపంచ కప్ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రపంచ కప్ పై తాజాగా ఫిక్సింగ్ మేఘాలు కమ్ముకున్నాయి. 

తొమ్మిదేండ్లు గడిచాయి. వరుసగా 2007, 2011 రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్స్‌కు చేరినా..... శ్రీలంక జట్టు టైటిల్‌కు నోచుకోలేదు. వరల్డ్‌కప్‌ విజేత ధోనీసేనకు స్వదేశంలో బ్రహ్మరథం పట్టగా.. ఫైనల్స్‌కు చేరటం సైతం గొప్ప ఘనతనేని లంకేయులు సంగక్కర బృందానికి జేజేలు పలికింది. 

బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌కప్‌ ముద్దాడి ఐసీసీ టోర్నీలకు మెగా వీడ్కోలు పలుకగా.. స్పిన్‌ మాంతికుడు ముత్తయ్య మురళీధరన్‌ ఫైనల్స్‌కు చేరిన సంతృప్తితో వన్డే కెరీర్‌ను ముగించాడు. 

2011 వాంఖడే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ దృశ్యాలు పలు ప్రత్యేకతలకు చిహ్నం!. 9 ఏండ్ల తర్వాత, ఇప్పుడో వివాదాస్పద కారణంతో 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మళ్లీ చర్చనీయాంశం అయ్యింది. చారిత్రాక దృశ్యాలకు వేదికైన వాంఖడే ఫైనల్స్‌ ఫిక్సింగ్‌ చేశారని శ్రీలంక మాజీ క్రీడా శాఖ మంత్రి ఆరోపణలు చేయటం సంచలనం రేపుతోంది. అసలు ఇన్నాండ్ల తర్వాత ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందనే విషయం ఆసక్తికరంగా మారింది. 

ఫిక్సింగ్ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు....?

2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. నిజానికి వరుసగా రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు చేరిన శ్రీలంక అత్యున్నత స్థాయిలో నిలకడ చూపించింది. కెప్టెన్‌ కుమార సంగక్కర, వైస్‌ కెప్టెన్‌ మహేళ జయవర్ధనె, స్పిన్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ మెరుపులకు ఆ వరల్డ్‌కప్‌ వేదికైంది. ఓపెనర్‌ తిలకరత్నె దిల్షాన్‌ 2011 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత దక్కించుకున్నాడు. పరుగుల వేటలో సచిన్‌ టెండూల్కర్‌ను రెండో స్థానంలో ఉంచి దిల్షాన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 

వరల్డ్‌కప్‌ నెగ్గేందుకు శ్రీలంక వద్ద అన్ని వనరులు ఉన్నాయి. వరల్డ్‌కప్‌ ఫైనల్లో శ్రీలంక జట్టులో నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో శ్రీలంక సెలక్షన్‌ కమిటీ చమర కపుగెదర, సురజ్‌ రన్‌దివ్‌లను చమర సిల్వ, అజంత మెండిస్‌ స్థానంలో జట్టులోకి ఎంపిక చేసింది. 

గాయపడిన ఆల్‌రౌండర్‌ ఎంజెలో మాథ్యూస్‌ స్థానంలో తిశార పెరీరా.. రంగన హెరాత్‌ స్థానంలో నువాన్‌ కులశేఖర ఫైనల్లో ఆడారు. రంగన హెరాత్‌ మెరుగ్గానే రాణిస్తున్నా... భారత్‌తో గత మ్యాచుల్లో హెరాత్‌ ప్రభావం చూపలేదు. ధోనీసేన రంగన హెరాత్‌ను సునాయాసంగా ఆడేసింది. దీంతో రంగన హెరాత్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. ముత్తయ్య మురళీధరన్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోయినా.. కెరీర్‌ చివరి మ్యాచ్‌ కానుండటంతో జట్టులో నిలిచాడు.

ఆరోపణలు ఏమిటి...?

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక జట్టు విజయావకాశాలను శ్రీలంక సెలక్షన్‌ కమిటీ అమ్ముకుందని మాజీ క్రీడా మంత్రి మహిదానంద ఆరోపణలు చేశారు. 

సెలక్షన్‌ కమిటీ ఆఖర్లో చేసిన మార్పలకు తన ఆమోదం లేదని మహిదానంద అంటున్నారు. 2011-2015 వరకు మహిదానంద క్రీడా మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నోరు మెదపని మహిదానంద ఇప్పుడు ఆరోపణలు చేయటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీలంక ప్రభుత్వం మహిదానంద ఆరోపణలపై విచారణకు సైతం ఆదేశించటం కొసమెరుపు.

9 సంవత్సరాల తరువాత ఇప్పుడెందుకు...?

మహిదానంద 2011-2015 వరకు క్రీడా శాఖ మంత్రిగా కొనసాగారు. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వం అధికారికంగా జోక్యం చేసుకుంటుంది. క్రీడా మంత్రిత్వ శాఖ నేరుగా క్రికెట్‌ బోర్డు వ్యవహారాలు చూస్తుంది. మహిదానంద ఇప్పుడూ కేబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. 

క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యుడిగా ఉన్న సమయంలో మౌనం వహించిన మహిదానంద.. ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు చేసున్నాడు? ఆరోపణలు వెనుక అసలు ఉద్దేశం ఏమిటీ? తెలియాల్సి ఉంది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో కుమార సంగక్కర, మహేళ జయవర్ధనె క్రీయాశీలంగా పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి. 

2011 వరల్డ్‌కప్‌లో ఆ ఇద్దరు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌లుగా ఉన్నారు. సంగక్కర, జయవర్ధనెల కోసమని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే సెలక్షన్‌ కమిటీపైనే మంత్రి ఆరోపణలు గుప్పించారు. 2020 ఆగస్టులో శ్రీలంక పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆరోపణలకు పాల్పడ్డాడా? కాలమే సమాధానం చెప్పాలి.