ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్...  గురువారం శస్త్ర చికిత్స.. 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సందీప్ పాటిల్.. 

భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ఛీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ముంబైలోని అంధేరిలో ఉన్న ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం సందీప్ పాటిల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియచేశారు...

‘ఛాతిలో కాస్త ఇబ్బందిగా అనిపించగానే నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఇక్కడికి రాగానే అన్ని టెస్టులు చేశారు. నా ఈసీజీ నార్మల్‌గానే ఉంది. ఇంకొన్ని టెస్టులు చేసిన డాక్టర్లు, ఆంజియోగ్రఫీ చేసుకోవాల్సిందిగా సూచించారు. రక్త నాళాల్లో కొన్ని రాళ్లను గుర్తించారట. గురువారం నాకు ఆంజియోగ్రఫీ జరగనుంది...

మా 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో యష్‌ని కోల్పోయాం. కపిల్ దేవ్‌కి కూడా గుండె సమస్య వచ్చింది. ఇప్పుడు నాకు... అయితే భయపడాల్సిన అవసరం లేదు. నాది 66 ఏళ్ల పాత మెషిన్... కాబట్టి సర్వీసింగ్ చేయాల్సిన అవసరం పడింది.. 

నేను ఆరోగ్య సమస్యల మీద జనాలకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నా. కొన్ని సార్లు శరీరానికి మనం లొంగిపోవాలి. నిజాన్ని గ్రహించాలి. మీలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆలస్యం చేయకండి. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోండి. అంతేకానీ నేను టార్జాన్‌ని, నాకేం కాదని ధీమాగా చెప్పకండి. ఎంత ఫిట్‌గా ఉన్నవారికైనా ఏమైనా జరగొచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్...

1980లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సందీప్ పాటిల్, తన కెరీర్‌లో 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 36.93 సగటుతో 1588 పరుగులు చేసిన సందీప్ పాటిల్, నాలుగు సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు...

అలాగే వన్డేల్లో 24.51 సగటుతో 1005 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ రెండు ఫార్మాట్లో కలిపి 24 వికెట్లు తీశాడు సందీప్ పాటిల్.. 

2009లో వచ్చిన అనధికారిక ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ముంబై ఛాంప్స్‌కి కోచ్‌గా వ్యవహరించిన సందీప్ పాటిల్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత 2012లో బీసీసీఐ సెలక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా పని చేశాడు సందీప్ పాటిల్...

1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత వచ్చిన పాపులారిటీతో బాలీవుడ్‌లో పూనమ్ దిల్లాన్, దెబశ్రీ రాయ్‌తో కలిసి ‘కబీ అజ్‌నబీ తే’ అనే మూవీలో హీరోగా నటించాడు సందీప్ పాటిల్. మరో భారత క్రికెటర్ సయ్యద్ కిర్మనీ విలన్‌గా నటించిన ఈ సినిమా... భారీ అంచనాల మధ్య విడుదలై, డిజాస్టర్‌గా మిగిలింది..