భారత క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం 2007 టీ20 వరల్డ్ కప్. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్కమించిన టీమిండియా, సౌతాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగింది. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ స్వచ్ఛందంగా టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకోవడంతో సీనియర్లు లేకుండా సౌతాఫ్రికా వెళ్లింది ధోనీ టీమ్. ఏ మాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టి, విశ్వ విజేతగా నిలిచింది. మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ దాకా అద్వితీయంగా అదరగొట్టింది ధోనీ నాయకత్వంలోని టీమిండియా. 

వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, జోగిందర్ శర్మ, యూసఫ్ పఠాన్, రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్... వంటి ప్లేయర్లతో మ్యాజిక్ చేశాడు మహేంద్రసింగ్ ధోనీ. భారత క్రికెట్‌లో ధోనీ శకం ప్రారంభమవ్వడానికి కారణం టీ20 వరల్డ్‌కప్ విజయమే. అంతేకాదు ఐపీఎల్ ఆలోచన పుట్టడానికి కూడా 2007లో దక్కిన పొట్టి క్రికెట్ ప్రభంజనమే.

ఐపీఎల్ ఆలోచన 2007 వరల్డ్‌కప్ ముందే పుట్టినా, టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించాలనే ఆలోచన మాత్రం మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ తర్వాతే వచ్చింది. 13 సీజన్లుగా ఐపీఎల్ విజయవంతంగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అప్పటి భారత జట్టులో సభ్యులుగా ఉన్న రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ తప్ప మిగిలిన వారందరూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.