పూణే: స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ సిరీస్ ల్లో టీమిండియా ఒక జట్టు తర్వాత మరో జట్టును మట్టి కరిపిస్తూ వస్తోంది. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్ లో చెలరేగిపోతుండగా, మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లో ఆటగాళ్లు చూపుతున్న ప్రతిభ కారణంగా టీ20 ప్రపంచ్ కప్ పోటీలకు జట్టును ఎంపిక చేసే విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి, టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పి ఎదురయ్యే అవకాశాలున్నాయి. 

టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ లో ప్రారంభమవుతుంది. మైదానంలోకి అడుగు పెట్టాల్సిన 11 మంది సభ్యుల ఎంపికకు కసరత్తు జరుగుతోంది. జట్టును సాధ్యమైనంత త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో సమస్యను ఎదురయ్యే పరిస్థితి ఉంది. 

ఓపెనింగ్ స్లాట్ విషయంలో రోహిత్ శర్మకు ఢోకా లేదు. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ల్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమే సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ముగ్గురు ఆటగాళ్లు కూడా బాగా ఆడుతున్నారని, 2019లో రోహిత్ ప్రదర్శన అద్భుతమని, గత రెండు మూడు నెలలుగా కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడని, ప్రస్తుతం తాను కూడా తెర మీదికి వచ్చానని, శ్రీలంకపై జరిగిన చివరి టీ20లో తాను బాగా రాణించానని శిఖర్ ధావన్ అన్నాడు.

అది తన సమస్య కాదని, అది తన చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదని, తనకు లభించిన రెండు అవకాశాలను తాను వినియోగించుకున్నానని ఆయన చెప్పాడు.