క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. కాగా... అక్కడ ఓ బెంచిపై కూర్చొని సేద తీరుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోని సచిన్ తన సోషల్ మీడియాలో  షేర్ చేశారు. కాగా... దానికి బీసీసీఐ అధ్యక్షుడు చేసిన కామెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా పలువురు ఈ టాపిక్ పై స్పందించడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే... సచిన్ టెండుల్కర్ తన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి దానికి సూర్యడి ఎండలో సేదతీరుతున్నాను అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు. దానికి స్పందించిన దాదా.. ‘‘కొంతమందికి అదృష్టం అలా కలిసివస్తుంది.. హాలీడేస్ ఎంజాయ్ చెయ్యి’ అంటూ కామెంట్ పెట్టాడు.

Also Read అగ్రెసివ్ గా బంతులేయాలి, ప్రత్యర్థుల్లో వణుకు పుడుతుంది: బుమ్రాపై జహీర్ ఖాన్..

అయితే.. దాదా పెట్టిన కామెంట్ కి సచిన్ సైతం స్పందించాడు. తాను సరదా కోసం రాలేదనీ, ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్ (కార్చిచ్చు) క్రికెట్ మ్యాచ్ (నిధుల సమీకరణ కోసం ఆడిన మ్యాచ్) ద్వారా 10 మిలియన్ డాలర్లు సేకరించారని రిప్లై ఇచ్చాడు. దాంతో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ డిబేట్‌లో పాల్గొని సచిన్‌ను ట్రోల్ చేశాడు. 46 ఏళ్ల టెండుల్కర్... రిటైర్మెంట్ తీసుకొని మళ్లీ ఓ ఓవర్ ఆడేందుకు ఓవల్ జంక్షన్‌కి వచ్చాడు అని ట్రోల్ చేశాడు.

తన కెరీర్‌లో వన్డేల్లో దుమ్మురేపిన సచిన్ టెండుల్కర్... బుష్‌ఫైర్ క్రికెట్ బాష్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా ఆల్ రౌండర్ ఎల్లిసే పెర్రీ వేసిన స్పెషల్ ఓవర్‌ను ఎదుర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA)... ఆస్ట్రేలియాలో కార్చిచ్చులో గాయపడిన ప్రాణుల్ని కాపాడేందుకు విరాళాల సేకరణ కోసం ఈ మ్యాచ్ నిర్వహించింది. ఆస్ట్రేలియా కార్చిచ్చులో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.