న్యూఢిల్లీ: కొత్త పౌరసత్వం బిల్లుపై ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఆదివారం చోటు చేసుకున్న హింసపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. రాజకీయపరమైన విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తూనే ఉంటాయని, కానీ తన, దేశం వేదనంతా జామియా మిలియా విద్యార్థుల గురించేనని ఆయన అన్నాడు.

ఆ మేరకు ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ లో స్పందించాడు. సిఎఎపై ఆదివారం సాయంత్రం జామియా విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. వాహనాలను తగులబెట్టారు. హింసను అడ్డుకోవడానికి పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. 

వంద మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో విడుదల చేశారు. 

జామియా తలెత్తిన అశాంతి దేశంలోని మరికొన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు కూడా పాకింది. అలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, మను విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. ఏఎంయును ముందు జాగ్రత్త చర్యగా నలె పాటు మూసేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, కోల్ కతా జాదవ్ పూర్ విశ్వవిద్ాయలయం, మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయాల్లో కూడా ఆందోళనలు చెలరేగాయి.