Asianet News TeluguAsianet News Telugu

వెంటాడుతున్న ప్రపంచకప్ ఫైనల్ .. ‘‘ జరిగిన దాన్ని ఉదయాన్నే లేచి మరచిపోలేను ’’ : సూర్యకుమార్ యాదవ్

గురువారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి T20I మ్యాచ్‌కి ముందు సూర్యకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫైనల్‌లో ఘోర పరాజయం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. కానీ మనం ముందుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. 
 

'Can't just get up the next day and forget what happened : Suryakumar yadav ksp
Author
First Published Nov 22, 2023, 10:38 PM IST

ఆదివారం జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు వరుసగా 10 విజయాలు సాధించింది మంచి ఊపు మీదుంది. భారత్ జోరు చూస్తే కప్పు మనకే అని అంతా ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో అహ్మదాబాద్‌లో కప్పు భారత్ చేజారిందన్న నిజం 140 కోట్ల మంది భారతీయులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. స్లో పిచ్‌పై ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారత్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని ఆహ్వానించాడు - ఈ నిర్ణయం చివరికి ఫలితంలో కీలక పాత్ర పోషించింది. భారత్ 240 పరుగులకే ఆలౌట్ కాగా..  ఆస్ట్రేలియా ఇంకా ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. 

ఆస్ట్రేలియా బౌలర్లు వారి బౌలింగ్ వ్యూహాలతో కట్టుదిట్టంగా బంతులు విసిరి భారత పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేశారు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా అద్భుతమైన స్లోయర్ బాల్ వ్యూహాన్ని ప్రయోగించి సక్సెస్ అయ్యింది. పర్యవసానంగా సూర్య కేవలం 28 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఓటమి తరువాత, చాలా మంది టీమిండియా ఇండియా ఆటగాళ్లు విశ్రాంతి కోసం ప్రత్యేక మార్గాలను అనుసరించారు. అయితే సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు మాత్రం ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు-మ్యాచ్‌ల T20I సిరీస్‌ కోసం జట్టుతో ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ప్రపంచ కప్‌లో రాణించిన శ్రేయాస్ అయ్యర్ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల కోసం జట్టులో చేరనున్నాడు. 

గురువారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి T20I మ్యాచ్‌కి ముందు సూర్యకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమిని ఎలా తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఇది తనను తీవ్రంగా నిరాశ పరిచిందని.. మా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూస్తే మైదానంలో అద్భుతంగా ఆడామని సూర్య చెప్పాడు. తాము ఆడిన ఆటకు ప్రతి సభ్యుడు, ఆటగాళ్లే కాదు, యావత్ దేశం గర్వపడిందని వ్యాఖ్యానించారు. ఫైనల్‌లో ఘోర పరాజయం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. కానీ మనం ముందుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. 

జరిగినది మరచిపోవడానికి కొంత సమయం పడుతుందని.. సుదీర్ఘంగా జరిగిన టోర్నమెంట్‌లో మేం గెలవడానికి చాలా కష్టపడ్డామని ఆయన చెప్పాడు. సొరంగం చివర కాంతిని గమనించి ముందుకు సాగిపోవడమేనని సూర్యకుమార్ పేర్కొన్నాడు. జట్టులో కొత్త సభ్యులు వున్నారని.. అందువల్ల ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. ప్రత్యర్ధిని చూసి నిర్భయంగా వుండాలని.. జట్టు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా వుండాలని కొత్త ఆటగాళ్లకు సూర్యకుమార్ యాదవ్ సూచించాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నవంబర్ 23న తొలి మ్యాచ్ జరగనుంది. అనంతరం సెకండ్ టీ20 కోసం ఇరు జట్లు తిరువనంతపురం చేరుకోనున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios