ఒమిక్రాన్ టెన్షన్.. అనధికారికంగా బూస్టర్ డోసులు వేసుకుంటున్న ప్రజలు..
బూస్టర్ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే పలువురు బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు, థర్డ్ వేవ్ భయమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ అందరినీ టెన్షన్ పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 37 దేశాల్లోకి ఇది వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెళ్లడించింది. ఇండియాలో కూడా దీని ప్రతాపం చూపిస్తోంది. ఈ నెల మొదట్లో ఇండియాలో తొలి కేసులను గుర్తించారు. ఈ ఇరవై రోజుల కాలంలోనే ఒమిక్రాన్ కేసులు డబుల్ సెంచరీలు దాటాయి. ఇప్పటి వరకు భారత్‌లో 213 కేసులు వచ్చాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా తెలిపింది. మరో వైపు డెల్టా వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బూస్టర్ డోసు వేసుకుంటే దీనిని ఎదుర్కొవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి బూస్టర్ డోసుపై పడింది.
దేశంలో కొత్తగా 13 ఒమిక్రాన్ కేసులు.. అత్యధికం ఢిల్లీలోనే !
అనుమతి లేకున్నా...
కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు డెల్టా వేరియంట్ కేసులు కూడా పెరుగుతుండటంతో చాలా మందిలో ఆందోళన ఎక్కువవుతోంది. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే ప్రమాదం కాకపోయినా వేగంగా వ్యాపిస్తుందని తెలుస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ లు వేసుకున్న వారిని ఈ డెల్టా వేరియంట్ ఏమీ చేయలేదని, హాస్పిటల్‌లో చేరే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే అందరూ రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నారు. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఒమిక్రాన్ సోకుతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజుల వరకు మాత్రమే యాంటీబాడీలు ఉంటాయని, తరువాత తగ్గిపోతున్నాయని పలు అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి బూస్టర్ డోసులు వేయాల్సిన అవసరం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఐసీఎంఆర్ సమాలోచనలు చేస్తున్నాయి. బూస్టర్ డోసు ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ బూస్టర్ డోసు ప్రభావం ఎలా ఉంటుంది ? దీనిని వేసుకోవడం వల్ల తలెత్తే సమస్యలు ఏంటి అనే విషయంలో ఐసీఎంఆర్ శాస్త్రీయంగా అధ్యయనం చేస్తోంది. దాని ఫలితాలు వచ్చాక ఈ బూస్టర్ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
కోవిషీల్డ్ తీసుకున్న మూడు నెలలే రక్షణ - కొత్త అధ్యయన ఫలితాలు వెల్లడించిన లాన్సెట్ జర్నల్
బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించకముందే ప్రజలు బూస్టర్ డోసుల కావాలని కోరుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్, థర్డ్ వేవ్ భయం వారిని వెంటాడుతోంది. అందుకే చాలా మంది బూస్టర్ డోసు వేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. దీనిని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకోవాని చూస్తున్నాయి. తమకు బూస్టర్ డోసు కావాలని వచ్చే వారికి గుట్టు చప్పుడు కాకుండా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాయి. బూస్టర్ డోసుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకుండానే ఇలా చేయడం గమనార్హం. ఈ బూస్టర్ డోసును కోవిన్ పోర్టల్ లో రిజిస్టర్ చేయకుండానే ఇచ్చేస్తున్నారు. ఇలా వ్యాక్సిన్ కావాలని వచ్చే వారిలో వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారని సమాచారం. బూస్టర్ డోసు ప్రభావం ఎలా ఉంటుందో తెలియక ముందే ఇలా బూస్టర్ డోసులు వేసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అన్ని అంశాలు పరిశీలించాక కేంద్ర ప్రభుత్వం దీనిపై మార్గదర్శకాలు విడుదల చేస్తుందని, అప్పటి వరకు ఎవరూ అనధికారికంగా బూస్టర్ డోసులు వేసుకోకుడదని చెబుతున్నారు.