పిల్లల్లో కోవాగ్జిన్ మెరుగ్గా పని చేస్తుంది - ఎన్‌టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్ కే ఆరోరా
పిల్లలకు భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపించాయని ఎన్‌టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్ కే ఆరోరా అన్నారు. ఇలా చేయడం వల్ల కొత్త వేరియంట్ నుంచి పిల్లలను రక్షించవచ్చని తెలిపారు.
ఒమిక్రాన్ భయం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో కూడా ఈ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన మన దేశంలో మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఈ ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 400 దాటింది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేశాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే న్యూయర్ వేడుకలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఢిల్లీ అయితే క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. ఒమిక్రాన్ కేసులతో పాటు కోవిడ్-19 ఇతర వేరియంట్ కేసులు కూడా దేశంలో పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో అడుగు ముందుకేసింది. 12- 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
భారత్ లో Omicron పంజా.. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల్లోకి ఎంట్రీ..!
ఈ నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 12 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయంపై పలువురు నిపుణులు స్పందిస్తున్నారు. అందులో భాగంగానే కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ వర్కింగ్ గ్రూప్ ఎన్‌టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్ కే ఆరోరా మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో కోవాగ్జిన్ మంచి రోగనిరోధక ప్రతిస్పందనను చూపిస్తుందని తెలిపారు. తమ పరిశోధన ప్రకారం భారతదేశంలో కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల్లో మూడింట రెండు వంతుల మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే ఉన్నారని చెప్పారు. టీనేజ్‌లో ఉన్న పిల్లలకు కోవాగ్జిన్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు ఇది సోకే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అయితే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వాళ్లు ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు.
మొదటగా బూస్టర్ డోసులు అందుకునేది వీళ్లే.. 20 రకాల్లో ఏ వ్యాధి ఉన్నాబూస్టర్ డోసు !
రెండు డోసుల మధ్య నాలుగు వారాల వ్యవధి
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ ను 12-18 ఏళ్ల మధ్య పిల్లలకు ఇవ్వొచ్చని రెండు రోజుల కిందటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనమతి ఇచ్చింది. దీనిపై ఆరోరా స్పందించారు. ఈ కోవాగ్జిన్ పెద్దవారి కంటే పిల్లలోనే మెరుగైన ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. టీకా సురక్షితమైనదని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పిల్లలో యాంటీబాడీస్ పెరిగాయని తెలిపారు. పెద్దలకు ఇచ్చిన మోతాదులాగే పిల్లలకు కూడా ఇవ్వొచ్చని చెప్పారు. పిల్లలకు రెండు డోసుల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని తాను సూచిస్తానని అన్నారు. ఈ టీకా కార్యక్రమ అమలు కోసం ప్రత్యేకంగా కొత్త కార్యచరణ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. టీనేజ్ పిల్లలు తొందరగానే యాంటీబాడీస్ పొందుతారని అన్నారు.