corona virus : కరోనా కలవరం.. దేశంలో ఒక్క రోజే 3.47 లక్షల కోవిడ్ -19 కేసుల నమోదు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 3,47,254 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కేసులు భారీగా పెరుగుతున్నా సెకెండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కరోనా (corona) కలవర పెడుతోంది. మూడేళ్లుగా మానవజాతిని విడిచిపెట్టడం లేదు. 2019 వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తోంది. మన దేశంలో 2020 మొదటి నుంచి ఈ కరోనా ప్రభావం కనిపించడం ప్రారంభించింది. ఆ ఏడాది మొదటి వేవ్ రావడంతో దేశం లాక్ డౌన్ (lockdown) విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది. ఎందరో మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మరెందరో వివిధ రంగాల్లో ఉపాధి కొల్పోయారు. ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ఎందరో మంది తమ ఆత్మీయులను కొల్పోయారు.
మొదటి వేవ్ వచ్చిపోయిన సరిగ్గా ఏడాది తరువాత రెండో వేవ్ వచ్చింది. దీంతో ప్రభుత్వం కొన్ని రోజులు లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఈ సమయంలో కూడా మరెందరో ఇబ్బంది పడాల్సి వచ్చింది. మళ్లీ ఈ ఏడాది థర్డ్ వేవ్ (third wave) వచ్చింది. ఇలా వేవ్ లు మన చుట్టూనే తిరుగుతున్నాయి. మొదటి, రెండో వేవ్ లో డెల్టా వేరియంట్ (delta veriant) ప్రతాపం చూపితే.. ఇప్పుడు దానితో పాటు మరో కొత్త వేరియంట్ విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో (south africa) మొదటి సారిగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇది మన దేశంలో కూడా విస్తరించింది. డిసెంబర్ రెండో తేదిన ఇండియాలోకి కర్నాటక (karnataka) రాష్ట్రంలో మొదటి రెండు కేసులను గుర్తించారు. అప్పటి నుంచి ప్రతీ రాష్ట్రంలోనూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ స్వల్ప లక్షణాలు, స్వల్ప తీవ్రతను కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కొంచెం ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ ఈ వేరియంట్ ధీర్షకాలికంగా చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో దేశంలో కోవిడ్ -19 (covid - 19) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 20 రోజుల కిందట 10 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యేవి. అయితే ఈ మధ్య కాలం నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఉంటున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 3,47,254 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గడిచిన 249 రోజులలో అత్యధికమైన కేసులు. మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 9,287 కు పెరిగాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,51,777 కోలుకున్నారు. రోజువారీ సానుకూలత రేటు 17.94 శాతంకు చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.56 గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటిన్ (health buliten) విడుదల చేసింది. రెండో వేవ్ తో పోలిస్తే మూడో వేవ్ లో మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తీవ్రత తక్కువగా ఉందని చెప్పింది.