అమెరికా యుద్ధనౌకలో కరోనా వైరస్ బాధితులు: ఉన్నతాధికారులకు కెప్టెన్ లేఖ
కరోనా వైరస్ సోకిన నావికులు తమ నౌకలో ఉన్నారని వారిని క్వారంటైన్ చేయాలని అమెరికా యుద్దనౌక థియోడర్ రూజ్‌వెల్ట్ కెప్టెన్ బ్రెట్ క్రోజియర్ ప్రభుత్వాన్ని కోరారు.
వాషింగ్టన్: కరోనా వైరస్ సోకిన నావికులు తమ నౌకలో ఉన్నారని వారిని క్వారంటైన్ చేయాలని అమెరికా యుద్దనౌక థియోడర్ రూజ్‌వెల్ట్ కెప్టెన్ బ్రెట్ క్రోజియర్ ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే సుమారు ఐదువేల మంది ఉన్న నౌకలో ఈ వ్యాధి అందరికి సోకే అవకాశం ఉందన్నారు.
ఈ మేరకు ఆయన నౌకాదళ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్టుగా ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం యుద్ధం చేయడం లేదు, ఈ సమయంలో నావికులు మరణించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సకాలంలో స్పందించకపోతే ఈ వ్యాధి కారణంగా నౌకలో ఉన్నవారంతా అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.
Also read:కరోనా దెబ్బ:స్పెయిన్ రాణి మారియా థెరిసా మృతి
బ్రెట్ రాసిన లేఖ అందినట్టుగా అమెరికా నౌకదళ తాత్కాలిక కార్యదర్శి థామస్ మోడ్లీ ప్రకటించారు. నౌక కెప్టెన్ అభిప్రాయాలతో ఆయన ఏకీభవించారు. గ్వామ్ పోర్టులో ఈ నౌక ఉంది. ఈ నౌకలో విమానంతో పాటు యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కూడ ఉన్నాయి. ఈ సమయంలో సైనికుల ప్రాణాలు కూడ తమకు ముఖ్యమేనని ఆయన గుర్తు చేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ఈ దేశంలో సుమారు మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. రానున్న రెండు వారాలు అత్యంత కీలకమైనవని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.