కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. దీనిని నుంచి ప్రజలను ఎలా సురక్షితంగా బయటపడేయాలా అని దేశ ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. దానిని అర్థం చేసుకోకుండా కొందరు చేసే పనులు అధికారులకు తలనొప్పులు తెస్తున్నాయి.

కొందరేమో.. బయటకు రావొద్దని చెప్పినా వచ్చి తిరుగుతుండగా.. కొందరు సోషల్ మీడియాలో విషం కక్కుతున్నారు. కరోనా వైరస్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాల్సింది పోయి.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి పోస్ట్ చేసి.. ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులోని ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టాడు. "ప్రజలారా బయటకు వెళ్లండి... తుమ్మండి... కరోనా వైరస్‌ని వ్యాపింపజెయ్యండి" అంటూ అతను పెట్టిన ట్వీట్ కలకలం రేపింది. ఫేస్‌బుక్‌లోని ఆ పోస్ట్ ఆధారంగా... క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... ఆ 25 ఏళ్ల యువకుణ్ని అరెస్టు చేశారు.

 అతను బెంగళూరులోనే నివసిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పోస్ట్ పెట్టడం కోడ్ ఆఫ్ కండక్ట్‌కి వ్యతిరేకమన్న ఇన్ఫోసిస్... స్వయంగా అంతర్గత దర్యాప్తు జరిపించింది. అతను అనుకోకుండా ఈ పోస్టు పెట్టలేదనీ, కావాలనే పెట్టాడని తేల్చింది. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదన్న యాజమాన్యం... అతన్ని ఉద్యోగం నుంచీ తొలగిస్తున్నామని ప్రకటించింది.