Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ తో అమెరికాలో తెలుగు జర్నలిస్ట్ మృతి,మోడీ సంతాపం

అమెరికాలో స్థిరపడ్డ ఒక తెలుగు జర్నలిస్ట్ మరణించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. కంచిబొట్ల బ్రహ్మ అమెరికాలో కరోనా వైరస్ తో బాధపడుతూ మరణించాడు. 

Coronavirus Positive Telugu Journalist Dies In New York Hospital
Author
New York, First Published Apr 8, 2020, 11:38 AM IST

కరోనా వైరస్ అమెరికాను వణికిస్తోంది. ఆ దేశాధ్యక్షుడి ఇంకా కూడా లాక్ డౌన్ విధించకపోవడంతో అక్కడ మరణాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ కేవలం అమెరికన్లను మాత్రమే కాకుండా అక్కడున్న భారతీయులను, ముఖ్యంగా తెలుగువారిని కూడా పట్టి పీడిస్తుంది. 

అమెరికాలో స్థిరపడ్డ ఒక తెలుగు జర్నలిస్ట్ మరణించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.కంచిబొట్ల బ్రహ్మ అమెరికాలో కరోనా వైరస్ తో బాధపడుతూ మరణించాడు. 

యునైటెడ్ న్యూస్ అఫ్ ఇండియాలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన మరణవార్తను తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని తెలియజేసారు. ఆయన మరణంతో ఒక్కసారిగా భారతీయ అమెరికన్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడ ఆసుపత్రుల్లో కరోనా బారినపడి మృత్యువుతో పోరాడుతున్నవారికోసం అక్కడున్న భారతీయ అమెరికన్లు విరాళాలు సేకరించారు కూడా. 

తెలుగువారి కోసం తానా, ఆట లు కూడా ముందుండి సహాయం చేస్తున్నాయి. భారీ మొత్తంలో విరాళాలు సేకరించి అవసరమైన వారికి వైద్య సదుపాయాలకోసం డబ్బు చెల్లిస్తున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో భారతీయులు విస్తరించి ఉన్నప్పట్టికీ, న్యూయార్క్, న్యూ జెర్సీలో అత్యధికమంది ఉన్నట్టు తెలియవస్తుంది. 

ఇప్పటికే భారతీయ డాక్టర్లు కొద్దీ మంది ఈ వైరస్ బారినపడ్డారు. భారత కోడియోలోజిస్ట్ ఒకతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరొక భారతీయ ఇంజనీర్ రోహిత్ కూడా కరోనా వైరస్ తో పోరాడుతూ వెంటిలేటర్ సహాయంతో పోరాడుతున్నాడు. 

అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య అమెరికా వ్యాప్తంగా పది వేలు దాటింది. న్యూయార్క్‌లో పరిస్థితి మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. ఇప్పటికే పదివేలకు పైగా మరణాలు నమోదవ్వగా.. అందులో అధికంగా న్యూయార్క్ లోనే ఉండటం గమనార్హం.

Also Read కరోనాకు సెకండ్ వ్యాక్సిన్: రంగంలోకి అమెరికా కంపెనీ.. డిసెంబర్‌ నాటికి వినియోగంలోకి...

తాజాగా కరోనా మరణాల్లో న్యూయార్క్ రికార్డు నెలకొంది. కేవలం 24గంటల్లో న్యూయార్క్ లో 731 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో న్యూయార్క్ లో 731 కరోనా మరణాలు సంభవించాయని గవర్నర్ ఆండ్రూ క్యూయోమో వెల్లడించాడు. 

దాంతో న్యూయార్క్ లో కరోనా మరణాల సంఖ్య 6159 కుచేరింది. కాగా.. అతి కొద్ది కాలంలోనే అమెరికా లో లక్షకు పైగా మరణిస్తారని అక్కడి మెడికల్ అడ్వైసరి అంచనా వేసింది. 

కరోనా కట్టడి విషయంలో దేశ అధ్యక్షుడు ట్రంప్ ఉదాసీనతగా వ్యవహరించడం తో ఇప్పుడు కరోనా అక్కడ విలయతాండవం చేస్తుంది. ఇంత జరుగుతున్న కూడా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను విధించకపోవడం గమనార్హం.

న్యూయార్క్‌లో చనిపోయిన వారిని పూడ్చటానికి స్థలాలు కూడా సరిపోవడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలను ప్రారంభించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగితే హార్ట్ ఐల్యాండ్‌లో, అవసరమైతే పబ్లిక్ పార్క్‌లలో మృతదేహాలను పూడ్చనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios