కరోనా వైరస్ బారి నుంచి చైనా దాదాపు బయటపడినట్లే కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ కొత్త కేసులు నమోదు కావడం ఆగిపోయింది. దీంతో.. చైనా ఊపిరిపీల్చుకుంటోంది. ఈ వైరస్ తొలుత పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు విస్తరించింది.

Also Read కరోనా మరణాల్లో న్యూయార్క్ రికార్డ్.. 24గంటల్లో 731మంది...

దాదాపు 209 దేశాలు విలవిలలాడిపోతున్నాయి. కాగా కరోనా వెలుగుచూసిన వుహాన్ నగరవాసులకు చైనా ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు. 76 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత బుధవారం(ఏప్రిల్ 8,2020) లాక్ డౌన్ ఎత్తివేశారు.

కరోనా వైరస్ మొదట వ్యాపించింది కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే. దాని చుట్టూ హ్యూబే ప్రావిన్స్ ఉంది. ఈ మొత్తం ప్రదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఉండేవారు. కరోనా వ్యాపించిన కొన్నాళ్లకు... వుహాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన చైనా ప్రభుత్వం... ఆ తర్వాత హ్యూబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. 

ఇప్పుడు కరోనా వైరస్ కంట్రోల్ కావడంతో 11 వారాల తర్వాత అంటే 76 రోజుల లాక్‌డౌన్‌కి గుడ్‌బై చెప్పింది ప్రభుత్వం. దీంతో వుహాన్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. హమ్మయ్య అని రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు స్వేచ్ఛగా చైనా అంతా తిరిగొచ్చు.