రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు.. బడ్జెట్ సమావేశాల తొలిరోజే నిరసన..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Parliament Budget session) తొలి రోజే టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MPs) నిరసన తెలియజేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు బహిష్కరించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Parliament Budget session) తొలి రోజే టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MPs) నిరసన తెలియజేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు బహిష్కరించారు. తెలంగాణ పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ నాయకత్వం నిరసనగా ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాని దూరంగా ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు టీఆర్‌ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు.
టీఆర్‌ఎస్ పీపీ సమావేశంలో.. రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది.. ఈ సందర్భంగా దానిని సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని... తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని తెలిపారు. చట్టపరంగా, న్యాయపరంగా రావాల్సినవి కూడా రాలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన హామీలు, ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపల, వెలుపల పోరాడాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.