హైదరాబాద్: తెలంగాణలో సోమవారంనాడు మరో మూడు కరోనా కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 39కి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి.

మంగళవారం నమోదైన కేసుల్లో మూడు కాంటాక్ట్ కేసులు కాగా, మూడు విదేశాల నుంచి వారి కేసులు. హైదరాబాదులోని మణికొండలో 64 వృద్ధురాలికి కోరనా అంటుకుంది. కాగా, కొత్తగూడెం డీఎస్పీ, ఆయన ఇంటి పనిమనిషి కరోనా బారిన పడ్డారు. 

విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.

జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంటాక్ట్ కేసులు నమోదు కావడంతో రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

మంగళవారంనాడు మరో 9 కరోనా ఆనుమానిత కేసులను కూడా అధికారులు గుర్తించారు. వీరందరూ ఆస్పత్రుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. పోలీసుల సాయంతో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలయ్యే విధంగా చూస్తున్నారు. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై లాక్ డౌన్ అమలుయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.