హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ జిల్లాలో తాజాగా మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన జమాత్ కు వెళ్లివచ్చిన వ్యక్తి ఇంట్లో ఈ కేసులు బయటపడ్డాయి. వారితో సంబంధంలోకి వచ్చిన ఇతరులను కూడా క్వారంటైన్ కు తరలించారు 

ఇదిలావుంటే ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 9 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. వారంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చినవారేనని కలెక్టర్ చెప్పారు. 9 మందిని సికింద్రబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు ఆనయ తెలిపారు.

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లోని ఎంజీఎం నుంచి వారిని గాంధీకి తరలించారు. ఎంజీఎంలో చికిత్స అందించిన నలుగురు పీజీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపించారు.  

వరంగల్ లో ఢిల్లీ వెళ్లని ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరుకుంది. 

అలాగే శుక్రవారం మరో ఇద్దరు రోగులు మరణించడంతో మృతుల సంఖ్య 11కి చేరింది.

 మరోవైపు కోవిడ్ సోకి కోలుకున్న వారిలో 15 మంది శుక్రవారం డిశ్చార్జ్ అవ్వగా.. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.  

రాష్ట్రంలో పెరుగుతున్న కేసులన్నీ కూడా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలతో సంబంధాలు ఉన్నవే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి ఆచూకి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. దీంతో వేలాది మందికి నిర్మల్ పట్టణంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తి నివసించిన ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు.